ఏమిటి రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమేనా?

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబంపై మళ్ళీ బాణాలు సంధించడం ప్రారంభించారు. సోమవారం గాంధీభవన్ లో మీడియా  ప్రతినిధులతో మాట్లాడుతూ, మంత్రి కెటిఆర్ మావగారైన పాకాల హరనాధరావు తప్పుడు కులద్రువీకరణ పత్రాలతో అటవీశాఖలో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారని ఆరోపించారు. ఆయన ఎస్టీ కులస్థుడినని తప్పుడు కుల ధ్రువపత్రాలతో అటవీశాఖలో ఫారెస్ట్ రేజంర్ ఉద్యోగం సంపాదించుకొని 35 ఏళ్ళపాటు ఆ శాఖలో పని చేసి జిల్లా అటవీ అధికారిగా పదవీ విరమణ చేసి చాలా కాలంగా నెలనెలా పింఛన్ కూడా అందుకొంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే హరనాధరావు స్వయాన మంత్రి కెటిఆర్ కు మావగారు కావడంతో ప్రభుత్వం ఆయనపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విచారణ జరిపించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అటవీశాఖ నుంచి సమాచార చట్టం హక్కు ద్వారా సంపాదించిన పత్రాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. 

తాను అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి కెసిఆర్ నేరుగా సమాధానం చెప్పకుండా తనపై పెంపుడు జంతువులను ఉసిగొల్పితే భయపడబోనని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణా పిసిసి ఎస్టీ సెల్ చైర్మన్ జగన్ లాల్ నాయక్, మాజీ ఎంపి రవీంద్ర నాయక్ మాట్లాడుతూ, “గిరిజనులకు దక్కవలసిన ఉద్యోగాలను కూడా ఇతర కులస్తులు ఏవిధంగా దోచుకొంటున్నారో తెలుసుకొనేందుకు ఇది ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తరతరాలుగా గిరిజనులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించకపోతే న్యాయపోరాటం చేస్తాము,” అని హెచ్చరించారు.