మెట్రో రైల్ సమస్యలపై కేటిఆర్ దృష్టి

హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు ప్రజల నుంచి మంచి స్పందనే వస్తున్నప్పటికీ, ఇంకా స్టేషన్లలో త్రాగు నీరు, టాయిలెట్లు, బయట పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడం, స్మార్ట్ కార్డ్ రీ-ఛార్జింగ్ లో ఇబ్బందులు వంటి సమస్యలపై పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ద్వారా అవి మంత్రి కేటిఆర్ చెవిన కూడా పడటంతో నిన్న బేగం పేట క్యాంప్ కార్యాలయంలో హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్విఎస్. రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్, జి.హెచ్.ఎం.సి.కమీషనర్ జనార్ధన్ రెడ్డి తదితరులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు.

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సమస్యలపై చర్చించినప్పుడు ఈ సమస్య పరిష్కారానికి పోలీసులు, మెట్రో, జి.హెచ్.ఎం.సి. అధికారులు అందరూ సమన్వయంతో పని చేయవలసి ఉంటుందని మంత్రి కేటిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని మెట్రో స్టేషన్ల వద్ద వీలైనంత త్వరగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని మంత్రి కోరారు. పార్కింగ్ సౌకర్యం కల్పించడమే కాకుండా, దానిని ఎక్కడ ఏర్పాటు చేశారో ప్రజలకు కనబడేలా బోర్డులు పెట్టాలని సూచించారు. అన్ని మెట్రో రైల్ స్టేషన్లకు ఆర్టిసి బస్సులతో అనుసంధానించవలసి ఉందని అన్నారు. మెట్రో స్టేషన్లలో ‘పెయిడ్ ఏరియా’లలో టాయిలెట్లు, త్రాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు.

మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు మెట్రో రైల్ సర్వీసులకు మంచి ఆదరణ లభిస్తున్నందున ఆ మార్గంలో రద్దీని బట్టి మెట్రో ట్రైన్స్ సంఖ్యను పెంచాలని కోరారు. నగరం నుంచి హై-టెక్ సిటీలో ఉద్యోగాలు చేసేవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు కనుక అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో లైన్ పనులను వచ్చే ఏడాది జూన్ 1వ తేదీలోగా పూర్తిచేయడానికి ప్రయత్నించాలని మంత్రి కేటిఆర్ కోరారు.