తెరాస సర్కార్ కు నాగేశ్వర్ సూటి ప్రశ్న

నిన్న జరిగిన కొలువులకై కొట్లాట బహిరంగ సభలో అనేకమంది రాజకీయ నేతలు, మేధావులు పాల్గొన్న సంగతి తెలిసిందే. వారిలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య చెప్పిన మాటలు ఆలోచింపజేస్తాయి. 

ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ, “ఉద్యోగాల భర్తీ చేయమని కోరుతూ నిర్వహిస్తున్న ఈ సభను రాజకీయ నిరుద్యోగుల సభగా అధికారంలో ఉన్న కొందరు వాదిస్తున్నారు. అధికార పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకు తక్షణమే ప్రభుత్వంలో ‘ఉపాధి లేదా ఉద్యోగం’ లభిస్తోంది కానీ నిరుద్యోగులకు మాత్రం ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగాలు లభించడం లేదు. ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ పోస్ట్ ఖాళీ అయితే వెంటనే ఎన్నికలు నిర్వహించేస్తారు. ఐదేళ్ళు ఆగరు కదా? అదే.. ఒక ప్రభుత్వోద్యోగం భర్తీ చేయడానికి మాత్రం ఏళ్ళ సమయం పడుతోంది. ప్రతీ ఏడాది ఖాళీ అవుతున్న ఉద్యోగాలను వెంటనే ఎందుకు భర్తీ చేయడం లేదు? ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమీషన్ ఉన్నట్లే, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఒక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేయవచ్చు కదా?” అని ప్రశ్నించారు. 

చుక్కా రామయ్య మాట్లాడుతూ, “కోదండరాం తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించామని ప్రభుత్వాన్ని అడగడం లేదు. ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమని కోరుతున్నారు. ఇంతకు ముందు తెలంగాణా సాధన కోసం పోరాడిన ఆయన ఇప్పుడు తెలంగాణా ప్రజల కోసం పోరాడుతున్నారు. అటువంటి గౌరవనీయమైన వ్యక్తిని పట్టుకొని ముఖ్యమంత్రి కెసిఆర్ “వాడు’ “వీడు” అని అమర్యాదగా మాట్లాడటం చూస్తే మనసు చివుక్కుమనిపిస్తుంది. రాజకీయాలలో ప్రజల అభిప్రాయాలను గౌరవించలేనివ్యక్తి ఎన్నటికీ ప్రజల నుంచి గౌరవం పొందలేడు. ప్రొఫెసర్ కోదండరాం చెపుతున్న ప్రజా సమస్యలను వినడం ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఇష్టం లేకపోతే నిఘావర్గాల ద్వారానైనా ఆ సమాచారం తెప్పించుకోవచ్చు కదా? ప్రొఫెసర్ కోదండరాంను తిట్టిపోసి ప్రజలకు దూరం చేయాలని తెరాస సర్కార్ ప్రయత్నిస్తే, ఆయన ప్రజలకు ఇంకా దగ్గరవుతున్నారు. కనుక ఆయన పట్ల సముచిత గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది,” అని అన్నారు.