పద్మశ్రీ చేనేతన్నకు కోటి రూపాయలు నజరానా..శభాష్!

దానం లేదా ఆర్ధిక సహాయం సరైన వ్యక్తులకు అందిస్తే అది సద్వినియోగం అవుతుంది లేకుంటే అపాత్రాదానం అవుతుంది...నిరుపయోగంగా మారుతుంది. తెలంగాణా ప్రభుత్వం ఒక గొప్ప సత్కార్యానికి ఏకంగా కోటి రూపాయలు ఆర్ధిక సహాయం చేసింది. 

చింతకింది మల్లేశం పేరు ఎప్పుడైనా విన్నారా? బహుశః చాలా మందికి గుర్తుండకపోవచ్చు. పద్మశ్రీ చింతకింది మల్లేశం అంటే టక్కున గుర్తుకు రావచ్చు. 

సామాన్య చేనేత కార్మిక కుటుంబంలో పుట్టిన మల్లేశం తన తల్లి లక్ష్మి మగ్గం మీద పడుతున్న కష్టాన్ని చూసి ఆమెకు శ్రమ తగ్గించడానికి ‘ఆసు యంత్రాన్ని’ స్వయంగా తయారుచేశాడు. దానితో తక్కువ శ్రమతో చాలా సులువుగా, వేగంగా నేత పని చేయడానికి వీలవుతుంది. మల్లేశం ఎటువంటి ఉన్నత చదువులు చదుకోకపోయినా, తనలో ఉన్న సృజనాత్మకతకు పదునుబెట్టి ఆసు యంత్రాన్ని తయారుచేశాడు. అందుకే ఆయనకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు లభించింది. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా అతని కృషి, పట్టుదల, తెలివితేటలను గుర్తించి, సోమవారం కోటి రూపాయలు ఆర్ధిక సహాయం అందించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ ఈరోజు ఆయనకు కోటి రూపాయల చెక్ అందజేశారు. తన ప్రతిభను గుర్తించి ఇంతగా ప్రోత్సహిస్తుంనందుకు మల్లేశం ముఖ్యమంత్రి కెసిఆర్ కు, మంత్రి కేటిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ డబ్బుతో ఆలేరులో ఎకరం భూమి కొనుగోలు చేసి అక్కడే ఒక వర్క్ షాప్ ప్రారంభిస్తానని మల్లేశం తెలిపారు. ప్రస్తుతం తన చేతిలో 650 లక్ష్మీ ఆసు మెషిన్లకు ఆర్డర్లున్నాయని ఈ డబ్బుతో వాటి తయారీ ప్రారంభిస్తానని తెలిపారు. చేనేత రంగానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తానని తెలిపారు. ఇప్పుడు తయారు చేయబోయే లక్ష్మి ఆసు మెషిన్లను పోచంపల్లి చేనేత కార్మికులకు సరఫరా చేస్తానని చెప్పారు. 

ఉద్యోగం దొరకలేదని లేదా చదువుల ఒత్తిడి భరించలేకపోతున్నామని ఆత్మహత్యలు చేసుకొంటున్న యువత చింతకింది మల్లేశంను ప్రేరణగా తీసుకొంటే వారు కూడా అద్భుతాలు సృష్టించగలరు.