ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించడానికి సిద్దపడిన ప్రముఖ తమిళ నటుడు విశాల్ కు ఆదిలోనే భంగపాటు ఎదురైంది. చెన్నై ఆర్.కె.నగర్ ఉపఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్దపడి ఈరోజు నామినేషన్స్ దాఖలు చేయగా, దానిలో తప్పులు ఉన్నాయని చెపుతూ ఎన్నికల సంఘం తిరస్కరించింది. అతనితో బాటు స్వర్గీయ జయలలిత మేనకోడలు దీప వేసిన నామినేషన్స్ కూడా అదే కారణంతో ఎన్నికల సంఘం తిరస్కరించింది.
తన నామినేషన్స్ తిరస్కరించడంతో విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెన్నైలో ఎన్నికల సంఘం ముందు తన అనుచరులతో కలిసి ధర్నాకు కూర్చొన్నాడు. ఎన్నికల సంఘం రాజకీయ ఒత్తిళ్ళు, దురుదేశ్యంతోనే తన నామినేషన్స్ తిరస్కరించినట్లు భావిస్తున్నానని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నట్లు విశాల్ మీడియాతో అన్నారు. నామినేషన్స్ తిరస్కరిణపై దీప స్పందన ఇంకా తెలియవలసి ఉంది.
వారిరువురి నామినేషన్స్ తిరస్కరించబడటంతో ఇప్పుడు పోటీ ప్రధానంగా అధికార అన్నాడిఎంకె అభ్యర్ధి మధుసూదన్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె అభ్యర్ధి గణేష్, శశికళ మేనల్లుడు దినకరన్ మద్యే జరుగబోతోంది.