కోదండరాంపై తెరాస ఎదురుదాడి షురూ

నిన్న జరిగిన కొలువుల కొట్లాట సభలో ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేయడంతో తెరాస వెంటనే ఎదురుదాడి ప్రారంభించేసింది. ఆయనను ఎదుర్కోవడానికి తెరాసలోని ప్రత్యేక బ్రిగేడ్ ఉంది. దానిలో  ఎంపి బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నే ప్రభాకర్ లున్నారు. వారిలో బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇద్దరూ ఈరోజు ప్రొఫెసర్ కోదండరాంపై ఎదురుదాడి చేశారు. 

పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “టిజెఎసి నిర్వహించిన కొట్లాట సభకు ప్రజల నుంచి స్పందన కరువైంది. ఎందుకంటే అయన కొట్లాటలో రాజకీయ దురుదేశ్యం తప్ప నిజాయితీ లేదు కనుక. ఈవిధంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మా ప్రభుత్వంపై బురదజల్లే బదులు, కోదండరాంకు దమ్ముంటే రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికలలో మమ్మల్ని ఎదుర్కోవాలని సవాల్ చేస్తున్నాను. రాష్ట్రాభివృద్ధి కోసం రేయింబవళ్ళు పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ను, కోదండరాం వేలెత్తి చూపడం సిగ్గుచేటు. కెసిఆర్, కేటిఆర్, కవిత, హరీష్ రావు నలుగురూ కూడా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి గెలిచి రాజకీయాలలోకి వచ్చారు తప్ప దొడ్డి దోవన రాలేదు. కనుక వారిని విమర్శించే నైతిక హక్కు ప్రొఫెసర్ కోదండరాంకు లేదు. కాంగ్రెస్ పార్టీ, ప్రొఫెసర్ కోదండరాం చేతులు కలిపినా అభివృద్ధిని అడ్డుకోలేరు,” అని అన్నారు.

బాల్క సుమన్ మాట్లాడుతూ, “కొట్లాట సభ నిరుద్యోగుల కోసం జరిపింది కాదు. ప్రొఫెసర్ కోదండరాం కొలువు కోసం జరిగింది. మా ప్రభుత్వం 1.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా శాసనసభలో ప్రకటించినా, ఇంకా కోదండరాం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మాపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయన కాంగ్రెస్ పార్టీతో రహస్య అవగాహన చేసుకొనే మాపై ఈ బురద జల్లుడు కార్యక్రమం పెట్టుకొన్నారు. అయన మాటలు నమ్మి నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. త్వరలోనే అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాము,” అని అన్నారు.