గుజరాత్ లో 1995 నుంచి నేటి వరకు అంటే 22 ఏళ్ళుగా భాజపాయే అధికారంలో ఉంది. ఒకప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ అడుగు పెట్టలేదనిపించింది. కానీ అయన ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి డిల్లీకి వచ్చేసినప్పటి నుంచి గుజరాత్ లో భాజపా సర్కార్ కు ఎదురుగాలులు వీచడం మొదలయింది. ఒకప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో చాలా సునాయాసంగా విజయం సాధించిన భాజపా, త్వరలో జరుగబోయే ఎన్నికలలో విజయం సాధించి తన అధికారం నిలబెట్టుకోవడం కోసం ఏటికి ఎదురీదుతున్నట్లు శ్రమ పడవలసివస్తోంది.
ఈ ఏడాది ఆగస్ట్ నెలలో చేసిన సర్వేలలో ఈసారి ఎన్నికలలో కూడా భాజపా చాలా సునాయాసంగా విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. కానీ తాజాగా లోక్ నీతి-సిడిఎస్. పోల్ చేసిన సర్వేలో కాంగ్రెస్, భాజపా రెంటికీ దాదాపు సరిసమానంగా ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నాయని తేల్చి చెప్పింది.
గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. వాటిలో భాజపా 91-99 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 78-86 సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికీ భాజపాకే కొద్దిగా విజయావకాశాలు ఉన్నప్పటికీ, రెండు పార్టీల మద్య తేడా చాలా తక్కువగా కనిపిస్తోంది కనుక ఈసారి కాంగ్రెస్ విజయావకాశాలు కూడా ఉన్నాయని అర్ధం అవుతోంది.
గుజరాత్ లో ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్కువ. నోట్లరద్దు, జి.ఎస్.టి., నగదు రహిత లావాదేవీల కారణంగా గుజరాత్ వ్యాపారులు చాలా నష్టపోయుంటారు కనుక వారు భాజపాపై ఆగ్రహంగా ఉండటం సహజమే. పైగా అగ్నికి వాయువు తోడైనట్లు గుజరాత్ లో పటేల్ కులస్థుల యువనేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో భాజపాకు ఎదురీత తప్పడం లేదు. మిగతా అన్ని రాష్ట్రాలలో వరుస విజయాలు సాధిస్తున్న తన కంచుకోటలో ఓడిపోయినట్లయితే అది దానికి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆ విజయం ఎలాగూ రాహుల్ గాంధీ పద్దులో లిఖించబడుతుంది. త్వరలోనే అయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టబోతున్నారు కనుక ఒకవేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అది ఆయనకు తొలి కానుకవుతుంది.