నేటి నుంచి గురువారం వరకు హైదరాబాద్ లో కర్ఫ్యూ

డిసెంబర్ 6వ తేదీ ‘బ్లాక్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యలుగా హైదరాబాద్ లో మంగళవారం ఉదయం 6గంటల నుంచి గురువారం ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ ప్రకటించారు. కర్ఫ్యూ అమలులో ఉన్న ఈ సమయంలో నగరంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధిస్తున్నట్లు తెలిపారు. బ్లాక్ డే సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా         పాతబస్తీలోనే ఏకంగా 3,000 మంది పోలీసులను మొహరించారు. 

తెరాస, మజ్లీస్ అధినేతల మద్య చాలా చక్కటి స్నేహసంబంధాలు, బలమైన అనుబంధమే ఉంది. ఇటీవల జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ను మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పొగడ్తలతో ముంచెత్తగా, కెసిఆర్ కూడా ఓవైసీ సోదరులను ప్రసన్నం చేసుకొనేవిధంగా అనేక వరాలు గుప్పించారు. కానీ ఇప్పుడు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెరాస సర్కార్ కు ఇబ్బంది కలిగించే విధంగా బుధవారం బ్లాక్-డే సందర్భంగా బంద్ పాటించమని ముస్లింలకు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది.