ఉద్యోగాలే అడుగుతున్నాం...నీ కుర్చీని కాదు!

టిజెఎసి అధ్వర్యంలో సూర్ నగర్ స్టేడియంలో సోమారం సాయంత్రం ‘కొలువుల కొట్లాట’ సభ జరిగింది. ఇంతవరకు ‘తెలంగాణా ప్రభుత్వమంటూ’ పరోక్షంగా విమర్శలు చేస్తున్న టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈ సభలో నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఉద్దేశ్యించే మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. 

“మేమేమీ మీ ముఖ్యమంత్రి కుర్చీని మాకు ఇమ్మని అడగలేదు కదా? ఉద్యోగాలు ఇమ్మని అడిగితే అంత ఉలికిపాటు ఎందుకు? తెలంగాణా వస్తే రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు వస్తాయని మీరు చెప్పిన మాట వాస్తవం కాదా? మరి 42 నెలలు గడుస్తున్నా ఇంకా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదు? ఎందుకంటే మీ దృష్టి అంతా కాంట్రాక్టులు, ఇసుక దందాలు, కమీషన్లపైనే ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనే మీకు లేదు. ఉద్యోగాల కోసం సభ పెట్టుకొంటామంటే శాంతి భద్రతల సమస్య అని చెప్పి అనుమతి ఇవ్వరు. కానీ మందేసి చిందేసే ‘సన్ బర్న్’ కార్యక్రమాలకు నిరభ్యంతరంగా అనుమతిస్తారు. తెలంగాణా రాష్ట్రం వస్తే ప్రజల ఆకాంక్షలు తీరుతాయనుకొంటే ఆంక్షల రాజ్యం మొదలైంది. ప్రజల ఆకాంక్షలను మీ ఆంక్షలతో అణచివేయలేరని గ్రహిస్తే మంచిది.”

“ఉద్యోగాల ఖాళీల సంఖ్య, భర్తీపై మీరు (ముఖ్యమంత్రి కెసిఆర్) చెపుతున్నవన్నీ అబద్దాలే. వాటిపై శ్వేతపత్రం ప్రకటించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? తెలంగాణా ఏర్పడిన తరువాత గ్రూప్-1 పరీక్షలు అసలు ఎప్పుడైనా నిర్వహించారా? గ్రూప్-2 పరీక్షల ఫలితాలు వెల్లడించారా? ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించడం లేదంటే అర్ధం ఏమిటి? మీ ప్రభుత్వం ఉద్యోగాల సంఖ్యను కుదించివేస్తున్న మాట వాస్తవమా కాదా? హోంగార్డుల చేత వెట్టి చాకిరి చేయించుకొంటున్న మాట వాస్తవమా కాదా? ఉద్యోగాల భర్తీ విషయంలో మీరు మాయమాటలు చెపుతూ, కపట నాటకాలు ఆడుతూ కాలక్షేపం చేస్తున్నందునే మేము ఈ సభ పెట్టవలసి వచ్చింది. దీనిని కూడా రాజకీయ నిరుద్యోగుల సభ అంటే నవ్వొస్తోంది. ఉద్యోగాలు ఇమ్మని అడుగుతూ చేస్తున్న ఈ సభకు అటువంటి ముద్రవేసి మీరే రాజకీయాలు చేస్తున్నారు. అంత ముచ్చట ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాలు చేసుకో. అయినా మీ రాజకీయాలు మాకు అనవసరం. మాకు ఉద్యోగాల భర్తీ మాత్రమే కావాలి. మా ఓపిక నశించిపోతోంది. అందుకే ఇక గట్టిగా నిలదీసి అడగవలసి వస్తోంది. ఇప్పటికైనా మీరు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయకపోతే, మా ఆందోళనలను మరింత ఉదృతం చేస్తాము. నిరుద్యోగ సమస్యను ‘లైట్’ తీసుకొంటే మీకే నష్టమని గ్రహిస్తే మంచిది,” అని అన్నారు ప్రొఫెసర్ కోదండరాం.

కొలువుల కొట్లాట సభ తీర్మానాలు: 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను తక్షణం ప్రకటించాలి. 2. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలి. 3.కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలి.4.నిరుద్యోగ భృతి చెల్లించాలి. 5. స్థానిక పరిశ్రమలలో తెలంగాణా యువతకే ప్రాధాన్యం ఇవ్వాలి. 6.ఉద్యోగాలు, ఉపాధి పెంచేవిధంగా ప్రభుత్వం విధానాలు రూపొందించుకోవాలి.