కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆ పార్టీలో మరెవరూ నామినేషన్స్ వేయకపోవడంతో రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనప్రాయమేనని స్పష్టం అయిపోయింది. ఆయన ఒక్కరి తరపునే మొత్తం 89 నామినేషన్స్ సెట్లు సమర్పించబడ్డాయి. ఈరోజు సాయంత్రం వాటిని పరిశీలించడం, రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడుగా ప్రకటించడం అన్నీ లాంఛనప్రాయమే. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఓటమి మొదలు కొన్ని నెలల క్రితం జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వరకు దాదాపు అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే ఉంది. పంజాబ్, బిహార్ వంటి ‘యాదృచ్చిక విజయాలు’ తప్ప రాహుల్ గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సాధించిందేమీ లేదు. త్వరలో కీలమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. ఒకవేళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అది ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ విజయంగానే గర్వంగా చెప్పుకోవచ్చు లేకుంటే ఆయన ఖాతాలో మరో అవమానకర ఓటమి వ్రాసుకోకతప్పదు. వీటి తరువాత కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్య వంటి సార్వత్రిక ఎన్నికలు 2018 చివరిలో రాబోతున్నాయి. ఒకవేళ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే, ఇక అది కోలుకోవడం దాదాపు అసాధ్యమే అవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ మళ్ళీ పూర్వ వైభవం సాధిస్తారో లేదో మరొక ఏడాదిలోనే తేలిపోతుంది.