ఇంకా శంఖుస్థాపన దశలోనే..నిర్మాణాలు ఎప్పుడో?

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చి 42 నెలలు పూర్తయింది. మరో ఏడాదిలోగా మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెరాస సర్కార్ అనేక ప్రాజెక్టుల నిర్మాణం ఏకకాలంలో చేపట్టిన సంగతి వాస్తవం. అయితే 42 నెలలు గడిచిపోయినప్పటికీ కొన్ని మాత్రం ఇంకా శంఖుస్థాపన దశలోనే ఉన్నాయి. వాటిలో కొన్ని మహబూబ్ నగర్ జిల్లాలో దివిటిపల్లి వద్ద మెడికల్ కాలేజీ భవన నిర్మాణం, కొత్త సమీకృత కలెక్టర్ కార్యాలయం, బైపాస్ రోడ్డు మొదలైనవున్నాయి. 

రాష్ట్ర ఐటి, మున్సిపల్ మంత్రి కేటిఆర్ నేడు వాటికి శంఖుస్థాపనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మెచ్చుకోవలసిన విషయమే కానీ అవి శంఖుస్థాపనలకే పరిమితమయితే ప్రజల అసంతృప్తిని, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోక తప్పదు. 

నూతన సచివాలయం, ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గాలలో క్యాంప్ ఆఫీసులు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ప్రజలకు అత్యవసరమైన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల నిర్మాణంలో ఎందుకు చూపడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకపోయినా ఏమీ కాదు. కానీ ప్రజలు కూడా ప్రతిపక్షాల వాదనలతో ఏకీభవిస్తే తెరాసకు నష్టం కలిగే ప్రమాదం ఉంటుంది. 

ఉద్యోగాల భర్తీ విషయంలో ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న తెరాస సర్కార్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కొన్ని హామీల అమలులో జరుగుతున్న జాప్యం వలన, దాని చిత్తశుద్ధిని ప్రజలు కూడా శంఖించే ప్రమాదం ఉంది. 

ఎన్నికలు దగ్గర పడుతుండగా ఇప్పుడు వీటికి శంఖుస్థాపనలు చేస్తే వాటి నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి? ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి వస్తాయనే సందేహం కలగడం సహజం. కనుక శంఖుస్థాపనలకు కొబ్బరికాయలు కొట్టినప్పుడే వాటిని ఎప్పటి లోగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేదలచుకొన్నారో విస్పష్టంగా ప్రకటిస్తే మంచిది. ఇంకా ధైర్యం ఉన్నట్లయితే అదే హామీని శిలాఫలకం మీదే వ్రాయిస్తే మరీ మంచిది. ఆ గడువులోగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తే అప్పుడు తెరాస సర్కార్ గొప్పగా చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా అది గుర్తించి తెరాసను ఆదరిస్తారు.