వాళిద్దరి కంటే విశాల్ ముందుగా ఎంట్రీ

ప్రత్యక్ష రాజకీయాలోకి ప్రవేశిస్తామని కోలీవుడ్ సూపర్ స్టార్స్ కమల్ హాసన్, రజనీ కాంత్ చెపుతున్నారు. కానీ వారి సత్తా చాటుకోవడానికి వచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఇద్దరూ వినియోగించుకోకుండా మీనమేషాలు లేక్కిస్తూనే ఉండగా, మరో నటుడు విశాల్ ఎటువంటి హడావిడి చేయకుండా అకస్మాత్తుగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నాడు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్.కె.నగర్ నియోజకవర్గానికి ఈ నెల 21వ తేదీన ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. వాటిలో విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడానికి ఈరోజు నామినేషన్స్ వేయబోతున్నాడు. 

జయలలిత ప్రాతినిద్యం వహించిన ఆర్.కె.నగర్ నియోజకవర్గంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని, కానీ వాటిని పరిష్కరించడానికి ఎవరూ చొరవ చూపకపోవడంతో తాను ఈ నిర్ణయం తీసుకొన్నానని విశాల్ అన్నారు. ఈ ఉపఎన్నికలలో అధికార అన్నాడిఎంకె పార్టీ అభ్యర్ధిగా పార్టీలో సీనియర్ నేత మధుసూధన్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ డిఎంకె తరపున గణేష్,     శశికళ వర్గం తరపున ఆమె మేనల్లుడు దినకరన్ స్వతంత్ర భ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. డిఎంకె అభ్యర్ధి గణేష్ కు కాంగ్రెస్, వామ పక్షాలతో సహా అనేక ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఈ ఉపఎన్నికలు అన్నాడిఎంకె, డిఎంకె మరియు దినకరన్ బలనిరూపణ పరీక్షగా భావిస్తున్నారు. విశాల్ ఒక్కడే ఎటువంటి ఆశలు పెట్టుకోకుండా బరిలో దిగుతున్నాడు. ఈ నలుగురు అభ్యర్ధులలో ఎవరు గెలుస్తారనే విషయం ఈనెల 27వ తేదీన ఫలితాలు వెల్లడి అయినప్పుడు తెలిసిపోతుంది.