ఈనెల 4న సరూర్ నగర్ స్టేడియంలో టిజేఏసి నిర్వహించతలబెట్టిన కొలువుల కొట్లాట సభకు కాంగ్రెస్ పార్టీ, భాజపా, తెదేపా, వామపక్షాలతో సహా ప్రజా సంఘాలు అన్నీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. టిజేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్వయంగా ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరి వారిని కూడా ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరడంతో వారు అందుకు అంగీకరించారు.
ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను రాజకీయ కోణంలో నుంచి కాకుండా ఒక సామాజిక సమస్యగా చూడటం చాలా అవసరం. ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఎప్పటికప్పుడు ఒక క్రమపద్దతిలో ఉద్యోగాలను భర్తీ చేయకపోతే వాటి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న యువత తీవ్ర నిరాశానిస్ప్రహలకు లోనవుతారు. దాని వలన సామాజిక అశాంతి ఏర్పడుతుంది. తెలంగాణా ఏర్పడి తెరాస అధికారంలోకి వస్తే లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోమనే మేము కోరుతున్నాము. కానీ ప్రభుత్వం మా విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో దానిపై ఒత్తిడి తేవడానికి పోరాటాలు చేయక తప్పడం లేదు.
ఇదేదో రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నామనే ఆరోపణలు సరికాదు. తీవ్రమైన ఈ సమస్యను ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను కలుపుకొనిపోయి మాగొంతు గట్టిగా వినిపించక తప్పదు. మేము చేస్తున్న పోరాటం సరైనదేనని భావించినందునే ప్రతిపక్షాలు కూడా అడగగానే మద్దతు పలికాయి. ఉద్యోగాల భర్తీ విషయంలో మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపి ఖాళీలు భర్తీ చేయించడానికే ఈ సభ తప్ప మాకు వేరే ఏ ఇతర ఉద్దేశ్యాలు లేవు. ప్రభుత్వం కూడా మా ఈ సభకు ఎటువంటి ఆటంకాలు కల్పించకుండా సజావుగా జరుపుకోనిస్తే బాగుంటుంది,” అని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.