సుమారు నెలరోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో భాజపా నేత భరత్ రెడ్డి ఇద్దరు దళిత యువకులు బచ్చల రాజేశ్వర్, కొండల లక్ష్మణ్ లను బూతులు తిడుతూ కర్రతో కొట్టి రోడ్డు పక్కనే ఉన్న బురదగుంటలో మునగమని ఆదేశించడం, ఆ సంఘటన వీడియో సోషల్ మీడియాలో రావడం, భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ధర్నా చేయడం, పోలీసు కేసు నమోదు చేయడం, 20 రోజుల క్రితం గ్రామం నుంచి మాయం అయిన ఆ ఇద్దరు దళిత యువకులు నిన్న హైదరాబాద్ లో ఒక టీవీ ఛానల్ వద్దకు వచ్చి ఆ రోజు జరిగినది అంతా ‘దొరల రాజ్యం’ అనే సినిమా కోసం ఆడిన నాటకం అని చెప్పడం వంటి అనేక ఊహించని పరిణామాలు వరుసగా జరిగాయి. నిన్న సినిమా కోసం నటించామని చెప్పిన ఆ దళిత యువకులు ఇద్దరూ ఈరోజు అసలు విషయం బయట పెట్టారు.
తమను భరత్ రెడ్డి కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చి రోజుకో ప్రాంతానికి మారుస్తూ చాలా హింసించాడని, తమను కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుకోకుండా అడ్డుకొన్నాడని చెప్పారు. తమ పట్ల ఇంత అనుచితంగా ప్రవర్తించిన భరత్ రెడ్డిని పోలీసులు తక్షణం అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
వారిరువురూ తాము సినిమా కోసం ఆవిధంగా నటించమని అందుకు తమ ఇద్దరికీ చెరో రూ.20,000 చొప్పున ముట్టజెప్పారని నిన్ననే చెప్పారు. ఈరోజు భరత్ రెడ్డి తమను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చి హింసించాడని చెపుతున్నారు. ఈవిధంగా పొంతనలేని మాటలు చెపుతుండటం గమనిస్తే వారు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నన్నట్లు అనుమానం కలుగుతోంది. వారి చేత భరత్ రెడ్డే ‘సినిమా స్టోరీ’ చెప్పిస్తున్నాడేమోననే దళిత సంఘాల అనుమానం నిజమేననిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఇద్దరు దళిత యువకులకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రభుత్వమూ, పోలీసులు కూడా సరిచేయవలసి ఉంది. లేకుంటే దళితుల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు అనే భావన ప్రజలకు ఏర్పడే అవకాశం ఉంటుందని మరిచిపోకూడదు.