దేశంలో కోట్లాది ముస్లిం మహిళల జీవితాలను, వారిపై ఆధారపడిన పిల్లల జీవితాలను చిద్రం చేస్తున్న సామాజిక సమస్య ట్రిపుల్ తలాక్. అయితే దానిని ముస్లింల మత సంబంధిత వ్యవహారంగా పరిగణిస్తుండటం వలన కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమూ దానిలో వేలుపెట్టే సాహాసం చేయలేదు. కానీ కోట్లాది ముస్లిం మహిళలు పడుతున్న వేదన, వారి కష్టాలు, సమస్యలను అర్ధం చేసుకొన్న ప్రధాని నరేంద్ర మోడీ, ఈ మతాచారాన్ని సామాజిక సమస్యగానే చూడాలని నిర్ణయించుకొన్నారు.
సుప్రీం కోర్టు కూడా అయన అభిప్రాయంతో ఏకీభవించి, దేశంలో ఆరు నెలలపాటు ట్రిపుల్ తలాక్ ను నిషేధించింది. ఆలోగా ఎవరూ ట్రిపుల్ తలాక్ పద్దతిలో భార్యకు విడాకులు ఇచ్చినా అవి చట్టప్రకారం చెల్లవని నిర్ద్వందంగా ప్రకటించింది. ఆ గడువులోగా కేంద్రం దీని కోసం పార్లమెంటులో చట్టం తీసుకువస్తే, దానిని అమలు చేయవచ్చని లేకుంటే మళ్ళీ ట్రిపుల్ తలాక్ అమలులోకి వస్తుందని ఆనాడే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కనుక మోడీ సర్కార్ దీని కోసం ముసాయిదా బిల్లు రూపొందించి, దానిపై రాష్ట్రాల అభిప్రాయాల కోరిన్నట్లు తెలుస్తోంది.
దాని ప్రకారం ఇకపై ట్రిపుల్ తలాక్ విధానం రద్దు చేయబడుతుంది. ఒకవేళ ఎవరైనా ఆ పద్దతిలో భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే, మూడేళ్ళు జైలు శిక్ష విధించాలని భావిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
ముస్లింలు, వారి మత గురువులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దీనిని సమర్దించినట్లయితే ముస్లిం ఓటు బ్యాంకును వదులుకోవలసి రావచ్చు. కనుక రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, పార్లమెంట్ సభ్యులు దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.