సుమారు నెల రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామంలో స్థానిక భాజపా నేత భరత్ రెడ్డి, లక్ష్మణ్, రాజేశ్వర్ అనే ఇద్దరు దళిత యువకులను బూతులు తిడుతూ కర్రతో కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న బురదగుంటలో మునగమని ఆదేశిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో చాలా సంచలనం సృష్టించింది. భరత్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలంటూ స్థానిక దళిత సంఘాలు ర్యాలీలు కూడా నిర్వహించాయి. ఈ సంఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుండటంతో భరత్ రెడ్డితో తమ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని భాజపా ప్రకటించింది.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుండటంతో నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఏసీపీ సుదర్శన్ స్వయంగా ఆ ఇద్దరు దళిత యువకుల ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడారు. కానీ ఆ తరువాత కూడా పోలీసులు భరత్ రెడ్డిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత ఆ ఇద్దరు దళిత యువకులు హటాత్తుగా కనిపించకుండా మాయం అయిపోవడంతో భరత్ రెడ్డే వారిని కిడ్నాప్ చేసి ఉంటారని వారి కుటుంబ సభ్యులు పోలీసులకు పిర్యాదు చేశారు. దాంతో పోలీసులు భరత్ రెడ్డిపై ఏసీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొన్నారు.
సుమారు నెల రోజులుగా అంతు పట్టకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ వచ్చింది. 20 రోజుల క్రితం గ్రామం నుంచి మాయం అయిన ఆ యువకులు ఇద్దరూ శుక్రవారం హటాత్తుగా హైదరాబాద్ లో పోలీసుల ముందుకు వచ్చి భరత్ రెడ్డి తమను తిట్టడం, కొట్టడం అంతా నాటకమని, తాము ‘దొరల రాజ్యం’ అనే ఒక సినిమా కోసం ఆవిధంగా నటించామని చెప్పడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆ సినిమా ఆపని మీదనే హైదరాబాద్ వచ్చామని, ఆరోజు ఆవిధంగా నటించినందుకు తమకు సినీ నిర్మాతలు చెరో రూ.20,000 చొప్పున ఇచ్చారని చెప్పారు. ఈ సంఘటనలో ఇటువంటి ట్విస్ట్ వస్తుందని బహుశః పోలీసులు కూడా ఊహించి ఉండరు కనుక వారూ ఆశ్చర్యపోయారు.
ఆ రోజు జరిగింది సినిమా కోసమే అయితే ఆరోజున ఆ ప్రాంతంలో ఆ సినిమాకు సంబంధించిన సినీ బృందం కూడా వచ్చి ఉండాలి. వచ్చి ఉండి ఉంటే సినిమా షూటింగ్ చూసేందుకు స్థానిక ప్రజలందరూ వచ్చి ఉండేవారు. కానీ ఎవరూ రాలేదు. అది మినీ ఫిలిం అనుకోవడానికి సరైన ఆధారాలు లేవు. ఒకవేళ మొబైల్ ఫోన్ తోనే సినిమా తీసేరనుకొన్నా ఆ సంగతి నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ మిశ్రా, ఏసీపీ సుదర్శన్ గ్రామానికి వచ్చి దర్యాప్తు చేసినప్పుడు లక్ష్మణ్, రాజేశ్వర్ చెప్పి ఉండాలి. కానీ అప్పుడు వారు ఈ సినిమా స్టోరీ చెప్పలేదు. చెప్పి ఉండి ఉంటే అప్పుడే ఆ విషయం వారు ప్రజలకు తెలియజేసేవారు. కానీ ఆ తరువాత వారిరువురూ కనబడకుండా మాయం అవడంతో పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కనుక ఆ రోజు జరిగిన ఘటన సినిమా కోసం చేసిన నటన అంటే నమ్మశక్యంగా లేదు. చేసిన తప్పును తెలివిగా కప్పి పుచ్చుకోనేందుకే భరత్ రెడ్డి ఈ సరికొత్త నాటకం ఆడుతున్నాడని దళిత సంఘాలు అనుమానిస్తున్నాయి.