హైదరాబాద్ మెట్రో డే-వన్ రిపోర్ట్

బుధవారం నుంచి ప్రారంభం అయిన హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. నిన్న రాత్రి సర్వీసులు నిలిపివేసే సమయానికి సుమారు లక్ష మందికి పైగా మెట్రోలో ప్రయాణించారని మెట్రో అధికారులు తెలిపారు. మొదటిరోజున ఉద్యోగులు, విద్యార్ధుల కంటే మెట్రో రైల్ ప్రయాణం అనుభూతిని స్వంతం చేసుకోవాలని ప్రయాణించినవారే ఎక్కువగా కనిపించారు. అనేక ఏళ్లుగా మెట్రో రైల్ కోసం ఎదురుచూసిన హైదరాబాద్ వాసులు సకుటుంబ సమేతంగా మెట్రోలో ప్రయాణించి ఆనందించారు. మెట్రో రైల్లో ప్రయాణిస్తుంటే విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతోందని కొందరు చెప్పగా, ఇంత తక్కువ సమయంలో అంతంత దూరాలు చేరుకోగలగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మెట్రో రైళ్ళలో ప్రయాణించివారిలో చాలా మంది సెల్ఫీలు తీసుకొన్నారు. ట్రైన్స్ లోనే మీడియా ప్రతినిధులతో మెట్రో గురించి తమ అభిప్రాయాలను, సంతోషం వ్యక్తం చేశారు. కొంతమంది ఒక స్టేషన్ కు బదులు మరొక స్టేషన్ లో దిగి రూ.5-10 జరిమానాలు కూడా చెల్లించారు.

ఇక మియాపూర్ నుంచి నాగోల్ వరకు గల అన్ని ప్రధాన మెట్రో స్టేషన్లు కిటకిటలాడాయి. మద్యాహ్నం భోజన విరామ సమయంలో కూడా మెట్రో రైళ్ళు కిటకిటలాడాయి. సాధారణంగా మెట్రో రైళ్ళు ఒక్కో స్టేషన్లో 20 సెకన్లు మాత్రమే ఆగుతాయి. కానీ మొదటిరోజు కనుక రద్దీని బట్టి కొన్ని స్టేషన్లలో రెండు నిమిషాల వరకు ఆపారు.

మొదటి రోజున ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 50,000 మంది ప్రయాణించగా, రాత్రి 10 గంటలకు మరో 50,000 మంది ప్రయాణించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో సర్వీసుల వినియోగానికి హైదరాబాద్ వాసులు పూర్తిగా అలవాటుపడితే మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య క్రమంగా పెరిగి రోజుకు 2.0-2.5 లక్షల మందికి చేరుకోవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు గానీ మెట్రో నిర్వహణ వ్యయం గిట్టుబాటు కాదు. 

మొదటి రోజున మియాపూర్-అమీర్ పేట మద్య 7 మెట్రో రైళ్ళు, నాగోల్-అమీర్ పేట మద్య 7 రైళ్ళు తిప్పారు. మియాపూర్-అమీర్ పేట మద్య రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రతీ 8 నిమిషాలకు ఒకటి చొప్పున నడుపగా నాగోల్-మియాపూర్  మద్య ప్రతీ 15 నిమిషాలకు ఒకటి చొప్పున నడిపారు. మొత్తం మీద మెట్రో తొలిరోజు పెద్దగా సమస్యలు లేకుండానే విజయవంతంగా ముగిసాయి.