మహబూబ్ నగర్ జిల్లా పేరుచెప్పగానే అందరికీ మొట్టమొదట గుర్తుకు వచ్చేది అక్కడ పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళే కార్మికులే. కానీ ఇప్పుడు అదే జిల్లాకు పొరుగునే ఉన్న ఆంధ్రా నుంచి వ్యవసాయ కూలీలు వస్తుండటం విశేషం. ఈ ఏడాది కల్వకుర్తిలో జీడిపల్లి పరిసర గ్రామాలలో రైతులు సుమారు 1600 ఎకరాలలో పత్తి వేశారు. అయితే ఇదివరకు పనులులేక స్థానికంగా ఉండే వ్యవసాయ కూలీలు పొట్ట చేత్తో పట్టుకొని ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయినందున పాలమూరులో వ్యవసాయకూలీలు దొరకడం కష్టమైపోతోంది. అప్పుడు జీడిపల్లి రైతులు పొరుగునే ఉన్న ఏపిలోని గుంటూరు జిల్లాలో నరసారావు పేటకు వెళ్ళి అక్కడి నుంచి 140 మంది వ్యవసాయకూలీలను మాట్లాడి తెచ్చుకొన్నారు. వారికి స్థానికంగా వసతి సౌకర్యాలు కల్పించి కేజీ పత్తి ఒలిచేందుకు రూ.10 చొప్పున చెల్లిస్తున్నారు జీడిపల్లి రైతులు. ఈ పరిణామానికి సంతోషించాలా లేక బాధపడాలా?