కొట్లాట సభకు అనుమతి లభించింది

తెలంగాణా రాజకీయ జెఎసి అధ్వర్యంలో డిసెంబర్ 4వ తేదీన సరూర్ నగర్ స్టేడియంలో ‘కొలువుల కోట్లాట’ బహిరంగ సభ నిర్వహించుకోవడానికి అనుమతి లభించిందని టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీడియాకు తెలియజేశారు. కనుక రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగ యువత ఈ బహిరంగ సభకు బారీ ఎత్తున తరలివచ్చి తమ గొంతు వినిపించాలని ప్రొఫెసర్ కోదండరాం యువతను కోరారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీల వివరాలు ప్రకటించి వాటి భర్తీకి క్యాలెండర్ ప్రకటించాలని తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనందునే ఈ ‘కొలువుల కోట్లాట’ బహిరంగ సభ నిర్వహించవలసి వస్తోందని, దానికి కూడా ప్రభుత్వం అనేక అవరోధాలు సృష్టించి అడ్డుకోవాలని విఫలయత్నాలు చేసిందని, కానీ హైకోర్టు జోక్యంతో అనుమతించవలసి వచ్చిందని కోదండరాం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు అన్నిటినీ భర్తీ చేసినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గుతుందని కోదండరాం అన్నారు. అదేవిధంగా బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలలో, ప్రైవేట్ సెక్టార్ సంస్థలలో కూడా 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య లేకుండాపోతుందని అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కపట నాటకం ఆడుతోందని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనీసం ఇప్పటికైనా వివిధ శాఖలలో ఖాళీల వివరాలను ప్రకటించి, వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.