మెట్రో ముచ్చట్లు

హైదరాబాద్ వాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మెట్రో రైల్ సర్వీసులు ఈరోజు ఉదయం 6గంటల నుంచి ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన మియాపూర్-నాగోల్ మెట్రో కారిడార్ లో అప్పుడే మెట్రో రైళ్ళు రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. మెట్రో రైల్ ప్రయాణాలు ఇప్పుడు హైదరాబాద్ వాసుల నిత్యజీవితంలో ఒక భాగం కాబోతున్నాయి కనుక దానికి సంబందించిన కొన్ని ముఖ్య విషయాలు కూడా తెలుసుకోవడం చాలా అవసరమే.

ముందుగా టికెట్ ధరల గురించి తెలుసుకొందాము. మెట్రో కనిష్ట టికెట్ ధర రూ.10. గరిష్ట ధర రూ.60. 


నాగోల్ నుంచి మియాపూర్ వరకు ఒకే మెట్రో రైల్లో ప్రయాణించే అవకాశం లేదు. కనుక ప్రయాణికులు అమీర్ పేటలో దిగి రైలు మారవలసి ఉంటుంది. 

ప్రస్తుతం ఎఎస్.ఆర్.నగర్, నాగోల్, ప్రకాష్ నగర్‌ స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో స్మార్ట్ కార్డులు విక్రయిస్తున్నారు. త్వరలోనే అన్ని స్టేషన్లలో విక్రయించే అవకాశం ఉంది. ఒక్కో స్మార్ట్ కార్డు ఖరీదు రూ. 200. దానిలో రూ.100 కార్డు ధర. మిగిలిన రూ.100 ప్రయాణానికి. ఆ కార్డును ఉపయోగించుకొని ప్రయాణించాలంటే ఎప్పటికప్పుడు అధనంగా రీ-ఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది. కార్డు కాలపరిమితిని ఏడాదిగా నిర్ణయించారు. స్మార్ట్ కార్డుతో ప్రయాణించినట్లయితే టికెట్ ధరలో 5 శాతం రాయితీ లభిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా స్మార్ట్ కార్డు వద్దనుకొంటే దానిని ఏ మెట్రో స్టేషన్లోనయినా  వాపసు చేయవచ్చు. దానికి రూ.80 వాపసు లభిస్తుంది.