మెట్రో రైల్ సర్వీసులు షురూ..

హైదరాబాద్ వాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మెట్రో రైల్ సర్వీసులు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభం అయ్యాయి. విశేషమేమిటంటే, వాటిలో మొదట ఉద్యోగులు, వ్యాపారులు, కాలేజీ విద్యార్ధులు ప్రయాణిస్తారనుకొంటే, మార్నింగ్ వాక్ కోసం వచ్చిన వాళ్ళు, యువతీయువకులు, బార్యాభర్తలు తమ పిల్లలను వెంటబెట్టుకొని తెల్లవారుజామునే మెట్రో స్టేషన్లకు చేరుకొని టికెట్స్ కొనుక్కొని మెట్రో రైళ్ళలో సరదాగా తిరుగుతున్నారు. మెట్రో రైల్లో ప్రయాణం అనుభూతి ఏవిధంగా ఉంటుందో తెలుసుకొనేందుకు వచ్చినవారే అధికంగా ఉన్నారు. కొందరు కూకట్ పల్లి నుంచి అమీర్ పేట మళ్ళీ కూకట్ పల్లి వరకు మరికొందరు రామంతాపూర్ నుంచి అమీర్ పేట మళ్ళీ రామాంతపూర్ వరకు తిరుగు ప్రయాణపు టికెట్స్ కొనుకొని మెట్రో రైల్ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మెట్రో రైల్ సాగే మార్గంలో చాలా చోట్ల ప్రజలు నిలబడి పైనుంచి రివ్వున దూసుకుపోతున్న మెట్రో రైళ్ళను చూసి కేరింతలు కొడుతూ, మొబైల్ ఫోన్స్ తో ఫోటోలు తీసుకొంటున్నారు. 

మెట్రో రైళ్ళలో ప్రయాణిస్తున్న వారు మెట్రో సర్వీసులు, స్టేషన్లలో కల్పించిన సౌకర్యాల పట్ల చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ టికెట్ ధరలే కాస్త ఎక్కువ ఉన్నాయని చెపుతున్నారు. అలాగే ఇంకా అనేక మెట్రో స్టేషన్ల వద్ద వాహనాల పార్కింగ్ సౌకర్యం కల్పించకపోవడం వలన వాహనాలపై మెట్రో స్టేషన్లకు వచ్చినవారు వాటిని ఎక్కడ పార్క్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.