హైదరాబాద్ లో హెచ్.ఐ.సి.సి.లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ స్వాగతోపన్యాసం చేస్తూ, “ఈ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన దేశవిదేశీ అతిధులందరికీ తెలంగాణా రాష్ట్రం తరపున స్వాగతం చెపుతున్నాను. మీ అందరినీ స్వాగతించే అవకాశం నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సదస్సులో జరిగే చర్చలలో సరికొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు, ప్రతిపాదనలు వస్తాయని ఆశిస్తున్నాను. మా ప్రభుత్వం అమలుచేస్తున్న టీ-పాస్ పారిశ్రామిక విధానం వలన గత రెండేళ్ళలోనే 5,469 పారిశ్రామిక సంస్థలకు అనుమతులు మంజూరు చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణా రాష్ట్రం దేశంలో నెంబర్: 1 స్థానంలో ఉంది. అందుకే ఆపిల్, గూగుల్ , మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కు తరలివచ్చాయి. మా ప్రభుత్వం రాష్ట్రంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించింది. కనుక స్టార్ట్-అప్ లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉంటున్నాయి. ఈ సదస్సు తరువాత మా రాష్ట్రానికి మరిన్ని కొత్త సంస్థలు వస్తాయని ఆశిస్తున్నాను. మీరందరూ మా ఆతిధ్యాన్ని స్వీకరించి, మా హైదరాబాద్ నుంచి మంచి అనుభూతులను స్వంతం చేసుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలని కోరుకొంటున్నాను,” అని కెసిఆర్ అన్నారు.