హైదరాబాద్ లో హెచ్.ఐ.సి.సి.లో జరుగుతున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, ఈ మూడున్నరేళ్ళలో అభివృద్ధికి నిరోధకాలుగా ఉన్న అనేక చట్టాలను చెత్తబుట్టలో పడేసి అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ఆ కారణంగానే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రపంచదేశాలలో 153వ స్థానంలో ఉన్న భారత్ తన ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకొని ఇప్పుడు 100వ స్థానానికి చేరుకొందని అన్నారు. అయితే అంతటితో సంతృప్తి చెందడం లేదని తమ లక్ష్యం 50వ స్థానం సాధించడమని చెప్పారు. దేశం సమగ్రాభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోడీ చెప్పారు.
భారత్ లో ఇప్పుడు ‘స్టార్ట్ అప్’ లను ఇంకా ప్రోత్సాహించేందుకు సమగ్రమైన వ్యవస్థను, విధివిధానాలను రూపొందిస్తున్నామని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం చాలా ప్రోత్సహిస్తోందని మోడీ తెలిపారు. జన్ ధన్ ఖాతాలలో 50 శాతంకు పైగా మహిళలే ఉన్నారని తెలిపారు. అనేక యుగాల క్రితమే భారత్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని చెపుతూ మోడీ అందుకు వివిధ రంగాలలో అనేక ఉదాహరణలు పేర్కొన్నారు. అలనాడు అహల్యాబాయి మొదలు ఝాన్సీ లక్ష్మీ భాయ్ వరకు అనేకమంది మహిళాశక్తి నిదర్శనంగా నిలిచారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి సానియా మీర్జా, పివి సింధు, నెహ్వాల్ వంటి అనేక మంది మహిళలు భారత్ యొక్క మహిళాశక్తికి నిదర్శనంగా నిలుస్తున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఈ సదస్సు ద్వారా భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.