కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర భాజపా నేతలు స్వాగతం పలికారు. తరువాత ఆయన విమానాశ్రయ ఆవరణలోనే ఏర్పాటు చేసిన చిన్న సభలో భాజపా కార్యకర్తలను ఉద్దేశ్యించి ప్రసంగించారు. ఆ తరువాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ లతో కలిసి హెలికాఫ్టర్ లో మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకొన్నారు.
అక్కడ హైదరాబాద్ మెట్రో పైలాన్, తరువాత మెట్రో మొబైల్ యాప్, మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభించారు. ఆ తరువాత గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కేటిఆర్, హైదరాబాద్ మెట్రో అధికారులతో కలిసి మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రో రైల్లో ప్రధాని మోడీ పక్కన కూర్చొన్న మంత్రి కేటిఆర్ ఆయనకు మెట్రో ప్రత్యేకత గురించి వివరించారు. ఆయన ఎదురుగా కూర్చొన్న మెట్రో అధికారులు కూడా మెట్రో ప్రత్యేకతలు, సర్వీసులు గురించి ప్రధానికి వివరించుతుంటే ఆయన చాలా శ్రద్దగా విన్నారు.
కూకట్ పల్లి వరకు ప్రయాణించిన తరువాత వారందరూ మళ్ళీ అదే రైల్లో మియాపూర్ స్టేషన్ చేరుకొంటారు. అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ హెలికాఫ్టర్ లో హెచ్.ఐ.ఐ.సి.కి చేరుకొని అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించిన ఉపన్యసించిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్, ఇవాంకా ట్రంప్ తదితరులు ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఇవాంకా ట్రంప్ తో సమావేశం అవుతారు. రాత్రి 8గంటల నుంచి ఫలక్ నూమా ప్యాలెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న విందు కార్యక్రమానికి మోడీ హాజరవుతారు. విందు ముగిసిన తరువాత మళ్ళీ బేగంపేట విమానాశ్రయం నుంచి డిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.