హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులను రేపు మధ్యాహ్నం ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. బుదవారం ఉదయం 6గంటల నుంచి మెట్రో రైల్ సర్వీసులు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి. కనుక వాటిలో ప్రయాణించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఆదివారం నుంచి మెట్రో టికెట్ కార్డుల అమ్మకాలు ప్రారంభించింది. మొదటగా ఎస్.ఆర్. నగర్, ప్రకాష్ నగర్, తార్నాక, నాగోలు మెట్రో రైల్వే స్టేషన్లలో మెట్రో కార్డుల అమ్మకం ప్రారంభించగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక్కొక్కటీ రూ.200 విలువగల 2,200 మెట్రో కార్డులు అమ్మకమయ్యాయి. వీటిని గరిష్టంగా రూ.2,000 వరకు రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవి తీసుకొన్నట్లయితే మెట్రోలో ప్రయాణించే ప్రతీసారి టికెట్ కొనడం కోసం క్యూలో నిలబనవసరం లేదు. అలాగే వీటితో ఎంఎంటిఎస్, ఆర్టీసి, ప్రైవేట్ క్యాబ్స్ తో కూడా ప్రయాణించడానికి వీలుగా అనుసంధానించబోతున్నారు. కనుక నిత్యం మెట్రోలో ప్రయాణించదలచుకొనేవారు ఈ కార్డులు కొనుగోలుచేసుకోవడమే మంచిది.