హైదరాబాద్ లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరుగబోయే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఇవంకా ట్రంప్ తో దేశవిదేశాల నుంచి అనేకమంది అతిధులు వస్తున్నందున, గతవారం పదిరోజులుగా చాలా జోరుగా భద్రతాఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరంలో అనేకచోట్ల చిన్న చిన్న దుఖాణాలు, పాన్ డబ్బాలు, తోపుడు బళ్ళ వ్యాపారులను తొలగించివేశారు. నేటి సాయంత్రం నుంచి విదేశీ అతిధుల రాక మొదలవుతుంది కనుక అనధికారికంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు మొదలైపోయాయి. రేపటి నుంచి పూర్తిస్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకాబోతున్నాయి. 

రేపు అంటే మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభించడానికి వస్తున్నారు కనుక సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య నిన్న ప్రకటించారు. మియాపూర్ నుంచి కొండాపూర్, కొత్తగూడ వైపు వెళ్ళే వాహనాలు చందానగర్, నల్లగండ్ల ఫ్లైఓవర్, గుల్ మోహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి గచ్చిబౌలి మీదుగా వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు. 

అలాగే మియాపూర్ నుంచి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే వాహనాలు చందానగర్, పటాన్ చెరు, ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. 

మాతృశ్రీ నగర్‌ నుంచి వచ్చే వాహనాలు షీలా పార్క్‌ ప్రైడ్ వద్ద నుంచి మంజీరా రోడ్డు మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. 

పటాన్ చెరు, ఇక్రిశాట్, బీరంగూడ, రామచంద్రాపురం, అశోక్ నగర్, బీహెచ్ఈఎల్ నుంచి కూకట్ పల్లి, హైదరాబాద్‌ వెళ్ళే వాహనాలను బీహెచ్ఈఎల్, రోటరీ మీదుగా నల్లగండ్ల ఫ్లై-ఓవర్, గుల్ మొహర్ పార్క్ జంక్షన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మెహదీపట్నం మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. 

జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి నుంచి కూకట్ పల్లి, హైదరాబాద్‌ వెళ్ళాసిన వాహనాలు ఓఆర్ఆర్ ముత్తంగి మీదుగా మళ్ళించబడతాయి.  

ఈ ట్రాఫిక్ ఆంక్షలు రేపు మధ్యాహ్నం 3-4.30 గంటల వరకు అమలులో ఉంటాయని కమీషనర్ తెలిపారు. కానీ ఇంకా ముందుగానే అమలుచేసే అవకాశం ఉంటుంది కనుక ఈ మార్గాలలో నిత్యం ప్రయాణించే ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గుర్తుంచుకొని తదనుగుణంగా సిద్దపడి బయలుదేరడం మంచిది. లేకుంటే ఇబ్బందులు తప్పవు.