ఉస్మానియా విద్యార్ధి జెఏసి సంఘం నేత చనగాని దయాకర్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఆయన విద్యార్ధులతో సమావేశం నిర్వహించి తన నిర్ణయం తెలియజేశారు. అయన పిడిఎస్ యులో 12 సం.ల పాటు పనిచేశారు. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెరాస, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల సమస్యలను, వారి ఆకాంక్షలను పట్టించుకోకుండా అధికారం నిలబెట్టుకోవడం కోసమే ఫక్తు రాజకీయపార్టీగా మారిపోయి చాలా నిరంకుశంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని కనుక దానిని ఎదుర్కోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నట్లు దయాకర్ చెప్పినట్లు సమాచారం. ఒక విద్యార్ధి సంఘం నాయకుడు ఏదో ఒక పార్టీలో చేరడం పెద్ద విశేషమేమీ కాదు కానీ అధికారంలో ఉన్న తెరాసను కాదని దయాకర్ కాం గ్రెస్ పార్టీలో చేరాలనుకోవడం, ఉస్మానియా విద్యార్ధులలో తెరాస సర్కార్ పట్ల ఉన్న అసంతృప్తికి అద్దం పడుతోందని భావించవచ్చు.