ఏమిటి..కెసిఆర్ డిల్లీలో ధర్నా చేయబోతున్నారా?

ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఆసక్తికరమైన వార్త వచ్చింది. రిజర్వేషన్లు అమలుచేసుకొనే హక్కు రాష్ట్రాలకే ఉండాలని డిమాండ్ తో ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారని, దానికి తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ మద్దతు ప్రకటించారని దాని సారాంశం. 

ముస్లిం రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం అంగీకరించనట్లయితే, తెలంగాణా ప్రభుత్వం కేంద్రంపై సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభ సమావేశాలలో చెప్పారు కానీ తానే జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పలేదు. కనుక ఇది కొత్తవార్తే. 

రిజర్వేషన్లను నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకే ఉండాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నప్పటికీ, అందుకు రాజ్యాంగం అంగీకరించదు కనుక సుప్రీం కోర్టు కూడా అటువంటి ప్రతిపాదనలను తిరస్కరిస్తుంటుంది. ఆ విధానం అమలుకావాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం. అందుకు పార్లమెంటులో అన్ని పార్టీల సభ్యుల అంగీకారం, మద్దతు అవసరం. రిజర్వేషన్ల అంశాన్ని కదపడం అంటే తేనెతుట్టెను కదిపినట్లే. అందుకే ఇంతవరకు కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అటువంటి ఆలోచన కూడా చేయలేదు. పైగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు నిర్ణయించుకొనే అధికారం ఉన్నట్లయితే, ఇక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలను డ్డీ కొనడం జాతీయ పార్టీల వల్ల కాదు. ఎన్నికలలో ఓటర్లను తమవైపు తిప్పుకొని గెలవడానికి వాటికి ఇదొక బలమైన ఆయుధంగా మారుతుంది. ఇటువంటివే అనేక కారణాలున్నాయి. కనుక రిజర్వేషన్లను నిర్ణయించుకొనే అధికారం రాష్ట్రాలకు ఇచ్చే అవకాశమే లేదని భావించవచ్చు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఈ విషయాలన్నీ తెలియవనుకోలేము. కానీ అయన దాని కోసం డిల్లీలో ధర్నా చేయాలనుకోవడం నిజమైతే అది ఆశ్చర్యకరమైన విషయమే అవుతుంది.