జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి ప్రజలు, వ్యాపారులు, రైతులు నిజామాబాద్ తెరాస ఎంపి కవిత అహంకార వైఖరిని నిరసిస్తూ ఈరోజు మెట్ పల్లి బంద్ పాటిస్తున్నారు. అక్కడ ఉన్న చక్కర కర్మాగారాన్ని మళ్ళీ తెరిపించాలని స్థానిక రైతులు చాలా కాలంగా కోరుతున్నారు. స్థానిక ప్రతిపక్షాలు నేతలు కూడా వారికి మద్దతు తెలుపుతున్నారు. బహుశః ఆ కారణంగా కవిత వారి విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని చెరుకు రైతులు ఆరోపిస్తున్నారు.
వారు గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కనే కూర్చొని ధర్నా చేస్తున్నప్పటికీ ఆమె వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండటంతో వారు ఆమె వద్దకే వెళ్ళి విజ్ఞప్తి పత్రం ఇవ్వబోతే దానిని ఆమె పట్టించుకోకుండా అహంకారపూరితంగా వ్యవహరించి తమను అవమానించారంటూ ఆరోపిస్తూ శనివారం మెట్ పల్లి బంద్ కు పిలుపునివ్వడంతో పట్టణంలో దుఖాణాలన్నీ మూతపడ్డాయి. అందరితో చాలా ఓపికగా, ఆప్యాయంగా మాట్లాడే కవితక్క ఆవిధంగా వ్యవహరించారంటే నమ్మశక్యంగా లేదు. మెట్ పల్లి చక్కర కర్మాగారం తెరిపించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటో.. ఎందుకు ఆలస్యం అవుతోందో ఆమె స్వయంగా తెలియజేస్తే ప్రజలకు కూడా ఈ సమస్యకు ఉన్న మరో కోణం కూడా తెలుస్తుంది.