మెట్రో టారిఫ్ పై వీడని సస్పెన్స్

మంత్రి కేటిఆర్ ఇతర మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలతో కలిసి ఇవ్వాళ్ళ నాగోల్ నుంచి మెట్టుగూడవరకు మెట్రో రైల్ లో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మెట్రో రైల్ తో సహా ఆర్టీసి, ప్రైవేట్ క్యాబ్స్ లలో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ‘టి-సవారీ’ స్మార్ట్ కార్డును ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, “పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన 30కిమీ పొడవుగల మన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు దేశంలోకెల్లా అతిపొడవైనది. దీనిని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 28న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం 6గంటల నుంచి మెట్రో రైల్ సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి వస్తాయి. మొదట్లో ఏవైన కొన్ని ఇబ్బందులు తలెత్తెతితే ప్రజలు కాస్త సహనం వహించాల్సిందిగా కోరుతున్నాను. 

మొదటి ఆరు నెలలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుస్తాయి. ఆ తరువాత నుంచి తెల్లవారు జామున 5.30 నుంచి రాత్రి 11 గంటల వరకు నడుస్తాయి. అలాగే మొదట్లో ఒక్కో రైలుకు మూడు బోగీలు మాత్రమే ఉంటాయి. ఒక్కో దానిలో 338 చొప్పున ఒక్కో మెట్రో రైల్ లో 1,000 మంది వరకు ప్రయాణించవచ్చు. అవసరమైతే అదనపు బోగీలు జోడించబడతాయి. 

ప్రస్తుతం రోజుకు 57 మెట్రో రైల్ సర్వీసులుంటాయి. అవసరానని బట్టి వాటిని కూడా పెంచుతాము. ఇక టికెట్స్ ధరలను ఈరోజు సాయంత్రం గానీ రేపు ఉదయంగా గానీ ఎల్ అండ్ టి సంస్థ ప్రకటిస్తుంది. అవి సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంటాయి. ఇది మన మెట్రో కనుక దీనిని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనదే,” అని అన్నారు మంత్రి కేటిఆర్.