ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుటుంబ సభ్యులతో సహ నిన్న యాద్రాద్రి ఆలయాన్ని దర్శించుకొన్న తరువాత ఆలయ అభివృద్ధిపనులను పరిశీలించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జరుగబోయే బ్రహోత్సవాలలోపు యాదాద్రి రాజగోపురాలు, మహామండపం, రక్షణ గోడ ల నిర్మాణాలు పూర్తి చేయవలసి ఉండగా, ఆ నిర్మాణపనులు నత్త నడకన సాగుతున్నందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గుత్తేదారులు, ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు చూస్తుంటే మరో 20 ఏళ్ళయినా నిర్మాణాలు పూర్తయ్యేలా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. నీళ్ళు ప్రవహిస్తున్న గోదావరి నదిపైనే పనులు ఇంతకంటే వేగంగా జరుగుతున్నప్పుడు, యాదాద్రి కొండమీద ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తున్నా, చురుకుగా పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ వేగంగా, సమాంతరంగా అన్ని పనులు ఒకేసారి చేయడం చేతకాకపోతే తప్పుకోమని ఈ పనులను వేరే గుత్తేదారుకు అప్పగిస్తామని గుత్తేదారును ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఈ సందర్భంగా యాదాద్రి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అనేక సూచనలు ఆయన దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయన ఏమి చెప్పారంటే..
1. భవిష్యత్ లో యాద్రాద్రి కొండ దిగువ ప్రాంతాలలో జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కనుక స్థానిక గ్రామ పంచాయితీలను అన్నిటినీ కలిపి పురపాలక సంఘం (మున్సిపాలిటీ)గా మారుస్తాము. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపవలసిందిగా అధికారులను ఆదేశించారు.
2. భవిష్యత్ లో యాద్రాద్రి, కొండ దిగువన ప్రాంతాలలో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోజుకు కనీసం 15-20 లక్షల లీటర్ల మంచి నీళ్ళు అందుబాటులో ఉండేవిధంగా మిషన్ భగీరథ పధకం ద్వారా స్థానికంగా ఉన్న నాలుగు చెరువులను కలపడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలి.
3. అలాగే భవిష్యత్ లో యాద్రాద్రి విద్యుత్ అవసరాలకు తగ్గట్లుగా 132 కెవి సబ్-స్టేషన్స్ నిర్మించాలి.
4. యాదాద్రిపై ప్రెసిడెంషియల్ సూట్ పక్కన కాటేజీల నిర్మాణానికి దాతలను ఆహ్వానించాలి.
5. భవిష్యత్ లో యాద్రాద్రికి దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల తాకిడి పెరుగుతుంది కనుక నిత్యం 150 మంది పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి.
యాదాద్రి అభివృద్ధి పనులకు మరో రూ.150 కోట్లు విడుదల చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. నిధులు సమకూరుస్తునంత వేగంగా పనులు కూడా జరగాలని హెచ్చరించారు. ఇక నుంచి నెలకు రెండుసార్లు యాదాద్రికి వచ్చి పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు.