హైదరాబాద్ వాసులు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మెట్రో రైల్ సర్వీసులు ఈనెల 28 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంటే నేటికి ఇంకా మూడు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినా ఇంతవరకు మెట్రో రైల్ టికెట్ ధరలను ప్రభుత్వం ప్రకటించలేదు. టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొని ఒత్తిడికి గురవవలసి వస్తుందనే కారణంచేతే ఇంతవరకు టికెట్ ధరలు ప్రకటించకుండా తాత్సారం చేసి ఉండవచ్చు. మంత్రి కేటిఆర్ ఇవ్వాళ్ళ మెట్రో టికెట్ ధరలను స్వయంగా ప్రకటించబోతున్నారు. ముందుగా ఆయన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మియాపూర్ నుంచి మెట్టుగూడ వరకు మెట్రో రైల్ లో ప్రయాణించి మెట్రో సర్వీసులను, స్టేషన్లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించబోతున్నారు.
మెట్రో రైల్ కనీస టికెట్ ధర రూ.10 గరిష్ట ధర రూ.40-50 ఉండవచ్చునని సమాచారం. అదే నిజమయితే ఆ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉన్నట్లుగానే భావించవచ్చు. ఈ నెల 28న సాయంత్రం 3.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభిస్తారు.