ఈ నెల 30వ తేదీన సరూర్ నగర్ లో టిజెఎసి తలపెట్టిన కొలువుల కోట్లాట బహిరంగ సభకు హైకోర్టు అనుమతించినప్పటికీ, నగర పోలీస్ కమీషనర్ అంగీకరించకపోవడంతో టిజెఎసి మళ్ళీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు, భద్రతా కారణాల దృష్ట్యా ఈనెల 30, డిసెంబర్ 1, 6 తేదీల మినహా వేరే తేదీలలో ఎప్పుడైనా సభను నిర్వహించుకోవచ్చని తేల్చి చెప్పింది. దాని కోసం టిజెఎసి దరఖాస్తు చేసుకొన్నప్పుడు, దానికి 48 గంటలలోగా సమాధానం ఇవ్వలాని హైకోర్టు నగర పోలీస్ కమీషనర్ ను ఆదేశించింది.
విశేషమేమిటంటే, ఇవ్వాళ్ళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హైదరాబాద్ గచ్చి బౌలి స్టేడియంలో ‘సన్ బర్న్’ పేరిట చాలా బారీ స్థాయిలో ఒక వినోద కార్యక్రమం జరుగబోతోంది. ఆ కార్యక్రమంలో ‘పబ్స్’ లో మాదిరిగానే హోరెత్తించే సంగీతం, మద్యం త్రాగి, యువతీ యువకులు డ్యాన్సులు చేస్తారని సమాచారం. బహిరంగగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒక్కో టికెట్ రూ.7,500 చొప్పున నిర్వాహకులు అమ్మినట్లు సమాచారం.
కొలువుల కోసం సభ జరుపుకోవడానికి అనుమతించని ప్రభుత్వం, నగరం నడిబొడ్డున వేలాదిమంది యువతీయువకులు తప్పతాగి తందనాలు ఆడేందుకు ఏవిధంగా అనుమతించిందని టిజెఎసి నేతలు, కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తే వారిపై కటినమైన చర్యలు తీసుకొంటామని నగర పోలీస్ కమీషనర్ హెచ్చరించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గచ్చిబౌలి స్టేడియం చుట్టూ బారీగా పోలీసులను మొహరించారు.