డిసెంబర్ లో రేవంత్ రెడ్డి పాదయాత్ర షురూ?

వచ్చే నెలలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత, రేవంత్ రెడ్డి ఆయన అనుమతి తీసుకొని తెలంగాణా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారని సమాచారం. అయన కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తన పాదయాత్రకు రాహుల్ గాంధీ అనుమతి తీసుకొన్నట్లు వార్తలు వినిపించాయి. కనుక రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం ఖాయమనే భావించవచ్చు. పార్టీలో కొత్తగా చేరిన రేవంత్ రెడ్డిని పాదయాత్రకు అనుమతించడం అంటే, ఆయనకు పార్టీ అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పకనే చెప్పినట్లు అవుతుంది. కనుక రేవంత్ రెడ్డికి పార్టీలో కీలకపదవి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

అయితే పిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్ర చేయలనుకొంటే కాంగ్రెస్ అధిష్టానం అనుమతించలేదు. పార్టీలో సీనియర్ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని రేవంత్ రెడ్డిని పాదయాత్రకు అనుమతించినట్లయితే ఆ అసంతృప్తితో ఆయన పార్టీని వీడినా ఆశ్చర్యం లేదు. పార్టీ వీడకపోయినా రేవంత్ రెడ్డిని పాదయాత్రకు అనుమతించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించవచ్చు. కనుక రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే పాదయాత్ర చేపట్టబోతున్నప్పటికీ సరిగ్గా అదే కారణం చేత కాంగ్రెస్ పార్టీ నేతల మద్య లుకలుకలు మొదలయ్యే అవకాశం ఉంది.