ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్ నగరాన్ని ‘ఇవాంకా తుఫాను’ తాకబోతోంది. వారం పదిరోజుల ముంచే దాని ప్రభావం అప్పుడే మొదలైపోయింది. అయితే ఈ తుఫాను కారణంగా ప్రాణ నష్టం ఏమీ జరుగదు కానీ ఆస్తి నష్టం బారీగానే ఉండబోతోందని స్పష్టం అవుతోంది. మానవరూపంలో వస్తున్న ఆ తుఫాను మరెవరో కాదు..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దొరగారి ముద్దుల కూతురు ఇవాంక ట్రంప్!
ఈ నెల 28 నుంచి 30వ తేదీ మధ్యాహ్నం వరకు మాదాపూర్లోని హెచ్.ఐ.సి.సి.లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్ (జి.ఈ.ఎస్) సదస్సు జరుగబోతోంది. దానిలో పాల్గొనేందుకు ఇవాంకా ట్రంప్ తో సహా దేశవిదేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.
ఈ సదస్సులో పాల్గొనబోయే అతిధులు హైదరాబాద్ నగర సందర్శనకు, షాపింగ్ కు వెళ్ళడం సహజమే కనుక వారు పర్యటించే అవకాశాలున్న అన్ని ప్రాంతాలలో, షాపింగ్ మాల్స్, మార్కెట్లలో చాలా జోరుగా భద్రతా ఏర్పాట్లు మొదలయ్యాయి. వారిలో ఇవాంకా ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ముద్దుల కూతురు కనుక ఆమె కోసం అధనపు భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలలో షాపుల యజమానులు అందరూ తక్షణం సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సదస్సు జరుగుతున్న పరిసర ప్రాంతాలలో మరియు అతిధులు పర్యటించబోయే ప్రాంతాలలో..ముఖ్యంగా ఇవాంకా ట్రంప్ పర్యటించబోయే ప్రాంతాలలో వీధి పక్కన ఉండే చిన్న చిన్న కిరాణా దుఖాణాలు, పాన్ షాపులు, రోడ్లపై తోపుడు బళ్ళు, ఫుట్ పాత్ వ్యాపారస్తులు వగైరాలన్నిటినీ పోలీసులు తొలగిస్తున్నారు.
విదేశీ అతిధుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వమే భాద్యత వహించాల్సి ఉంటుంది కనుక, దుఖాణాలు తొలగింపు, మూసివేత విషయంలో కటినంగా వ్యవహరించక తప్పడం లేదు. రహేజ ఐటీపార్కు సమీపంలో గల వెస్టిన్ హోటల్ లో ఇవాంకా ట్రంప్ బస చేస్తారు. అక్కడి నుంచి సదస్సు జరిగే హెచ్.ఐ.సి.సి.కి వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకొనేవారినందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఈ భద్రతా ఏర్పాట్ల కారణంగా తమ వ్యాపారాలు, బ్రతుకు తెరువు దెబ్బ తింటున్నాయని వాటిపై ఆధారపడినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నడూ చూడని ట్రంప్ దొరగారి కూతురు కోసం వారందరూ త్యాగాలు చేయకతప్పడం లేదు. అదే..మన ప్రధానమంత్రి...రాష్ట్రపతి వంటి ప్రముఖులు అమెరికా పర్యటనకు వెళితే అక్కడ ఈ స్థాయిలో హడావుడి కనిపించదు.
సదస్సుకు వచ్చే అతిధుల భద్రత కోసం నగరంలో జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను చూస్తే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే అనే పాత నానుడి గుర్తుకు రాకమానదు.