సొల్లు కబుర్లకే శాసనసభ సమావేశాలా?

ఇతర రాష్ట్రాల శాసనసభ సమావేశాలతో పోలిస్తే తెలంగాణా శాసనసభ సమావేశాలు చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలతో సాగుతున్నాయని చెప్పవచ్చు. శాసనసభ సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులకు కూడా తగినంత సమయం కేటాయిస్తూ, వారు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తెరాస సర్కార్ తగినంత అవకాశం కూడా కల్పిస్తోంది. కనుక అందుకు అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరినీ అభినందించడం ధర్మం. 

కానీ స్పీకర్ మధుసూధనాచారి అధికార పార్టీ కనుసన్నలలో నడుస్తూ శాసనసభ సమావేశాలలో తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు ఎంతసేపు తమ ప్రభుత్వం గొప్పదనం గురించి గంటలుగంటలు స్వంత డబ్బా కొట్టుకోవడానికే పరిమితం అవుతున్నారు తప్ప తాము లేవనెత్తిన సమస్యలకు సరైన సమాధానాలు చెప్పడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

టి-కాంగ్రెస్ నేతలు నిన్న హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి రైతు రుణాల మాఫీ అంశంపై ప్రభుత్వవైఖరిని తప్పుపడుతూ తీవ్ర విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ ఎంపి రేణుకా చౌదరి మాట్లాడుతూ, “అసెంబ్లీ సమావేశాలు అధికార పార్టీ ముచ్చట్లు చెప్పుకొనే వేదికగా మార్చేసింది తెరాస సర్కార్. రైతుల రుణాలు వడ్డీలతో సహా మాఫీ చేసేశామని ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలోనే అబద్దాలు చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఇంకా 22,000 మంది రైతుల రుణాలు అలాగే ఉన్నాయి. ఆ కారణంగా బ్యాంకులు వారికి కొత్త రుణాలు ఇవ్వడం లేదు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు..అన్ని జిల్లాలలో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. మరి రైతుల రుణాలన్నీ వడ్డీతో సహా మాఫీ చేసేసామని కెసిఆర్ ఏవిధంగా గొప్పలు చెప్పుకొంటున్నారు?ఇక నకిలీ విత్తనాలు తయారు చేసే సంస్థలపై కటిన చర్యలు తీసుకొంటామని గత ఏడాది ప్రకటించన తెరాస సర్కార్ మళ్ళీ వాటికే ఎందుకుఅనుమతులు మంజూరు చేసింది?నకిలీ విత్తనాల కారణంగా అనేకచోట్ల రైతులు నష్టపోయారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా, ఆధునిక వ్యవసాయ పద్దతులను అధ్యయనం చేయడానికి రైతులను, వ్యవసాయాధికారులను ఇజ్రాయిల్ దేశానికి పంపించడం వలన ఏమి ప్రయోజనం? ఆ డబ్బుతో రైతులకు నష్టపరిహారం చెల్లించవచ్చు కదా?” అని ప్రశ్నించారు.