హైదరాబాద్ లో మియాపూర్-నాగోల్ మద్య మెట్రో రైల్ సర్వీసులు ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రారంభించబోతున్నారు. అంటే నేటికి సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఇంకా మిగిలి ఉందన్నమాట. ఎస్.ఆర్. నగర్-మెట్టుగూడ మద్య నిన్నటి వరకు కూడా అన్ని రకాల పరీక్షలు చేసిన తరువాత, ఆ మార్గంలో మెట్రో రైల్ నడపడానికి సురక్షితమైనదని తెలియజేస్తూ మెట్రో రైల్ భద్రతా కమీషనర్ సోమవారం క్లియరెన్స్ సర్టిఫికేట్ మంజూరు చేశారు. కనుక 28న ప్రారంభోత్సవానికి మిగిలిన ఏకైక అవరోధం కూడా తొలగిపోయినట్లే. ఆరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటలకు మెట్రో సర్వీసును ప్రారంభించిన తరువాత ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్, మెట్రో అధికారులు తదితరులు మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు మళ్ళీ మియాపూర్ కు మెట్రోలో ప్రయనిస్తారు. అప్పటి నుంచి మెట్రో సేవలు నిరంతరంగా పనిచేయడం మొదలుపెడతాయి. ప్రజలందరూ ఉపయోగించుకోవచ్చు.