భారత్ ప్రముఖులపై దాడులకు ఐసిస్ కుట్ర?

భారత్ పై దాడులు చేయడానికి ఐసిస్ కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, మాజీ రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ తదితరులను వారు బహిరంగ సభలలో పాల్గొన్నప్పుడు దాడి చేయాలని ఐసిస్ కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అసోం రాష్ట్రంలో గౌహతీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఆ రాష్ట్రాలలో పైన పేర్కొన్న ప్రముఖులు వచ్చినప్పుడు వారిపై దాడులు చేయాలని ఐసిస్ కుట్రలు పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. కనుక వారందరికీ భద్రత మరింత పెంచి కట్టుదిట్టం చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. 

గత మూడున్నరేళ్ళలో దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో నిఘా, భద్రతా వ్యవస్థలు చాలా పటిష్టం కావడంతో ఉగ్రవాదుల బెడద తగ్గినట్లే కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకొంటున్నప్పటికీ, భద్రతాదళాలు ఎప్పటికప్పుడు వారిని ఏరిపారేస్తూనే ఉన్నాయి. కనుక ఉగ్రవాదులు సరిహద్దు రాష్ట్రాలను దాటి దేశంలోకి ప్రవేశించలేకపోతున్నారు. అయినా వారి కుట్రలు, ప్రయత్నాలు మానుకోలేదని ఈ తాజా హెచ్చరికలు సూచిస్తున్నాయి. కనుక మళ్ళీ అన్ని రాష్ట్రాల నిఘా మరియు పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది.