తెలంగాణాలో ఎన్ని పార్టీలున్నాయో తెలుసా?

తెలంగాణా రాష్ట్రంలో ప్రధానంగా కనబడే పార్టీలు తెరాస, కాంగ్రెస్, భాజపా, తెదేపా, వామపక్షాలు, మజ్లీస్ పార్టీలు. అవికాక రాష్ట్రంలో ఉన్న అనేక పార్టీల ఉనికి ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో వెలుగులోకి వచ్చింది. 

వాటిలో లోక్ సత్తా, ఆమాద్మీ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా పార్టీ, రాజ్యాధికార పార్టీ, ప్రజా స్వరాజ్ పార్టీ, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ, మహాజన సమాజం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, మజ్రూం వికాస్ పార్టీ, ఎం.బి.టి., బి.ఆర్.పి., ఆర్.ఎస్.పి. మొదలైనవి ఉన్నాయి. 

ఆ పార్టీల ప్రతినిధులు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిన్న జరిగిన సమావేశంలో పాల్గొని అందరూ కలిసి ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకొని, తెరాస, కాంగ్రెస్, భాజపాలపై పోరాడాలని నిశ్చయించుకొన్నారు. 

ఈ సందర్భంగా సిపిఐ (ఎమ్మెల్యే) రాష్ట్ర కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, తమ పార్టీ ఈ ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంది తప్ప దానికి నాయకత్వం వహించబోదని స్పష్టం చేశారు. తాము ధర్డ్ ఫ్రంట్ వెనుక నడుస్తాము తప్ప దానిని ముందుండి నడిపించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి వివాదాస్పద రచయితే ప్రొఫెసర్ కంచ ఐలయ్య అధ్యక్షత వహించడం విశేషం. 

ఈ సమావేశానికి హాజరైనవారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “తెలంగాణాలో ప్రస్తుతం నెలకొన్న అనారోగ్యకరమైన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని నేను భావిస్తున్నాను. దేశ ప్రజలకు వామపక్ష ప్రభుత్వాలపై ఎక్కువ నమ్మకం ఉందని నేను భావిస్తున్నాను. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటులో అవి ప్రధానపాత్ర పోషించవలసిన అవసరం ఉంది. అవినీతి రహితమైన, ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన కీలక భాద్యత మనపై ఉంది. దేశంలో నానాటికీ మత అసహనం, రాజకీయ అసహనం పెరిగిపోతోంది. కనుక ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అనివార్యమని నేను భావిస్తున్నాను,” అన్నారు ప్రొఫెసర్ కంచ ఐలయ్య.