కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయ మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సోమవారం డిల్లీలో పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ముఖ్య అజెండా పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేయడం. మన దేశంలో రాజకీయపార్టీలలో ప్రజాస్వామ్యబద్ధంగానే అంతర్గత ఎన్నికలను నిర్వహిస్తుంటాయి కానీ సర్వ సాధారణంగా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికలలో పార్టీలో ఇతరులు ఎవరూ నామినేషన్ వేయరు. వేస్తే వారు అధిష్టానాన్ని ధిక్కరించినవారిగా పరిగణింపబడి దాని ఆగ్రహానికి గురవుతుంటారనేది అందరికీ తెలిసిన రహస్యం. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు కనుక రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికవడం లాంఛనప్రాయమేనని చెప్పవచ్చు. అన్నీ సవ్యంగా సాగితే డిసెంబర్ 8వ తేదీన రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేసే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈరోజు సమావేశంలో దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.