త్వరలో సింగరేణిలో 12 కొత్త గనులు

శాసనసభ శీతాకాల సమావేశాలలో సింగరేణిపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ త్వరలో సింగరేణిలో 6 కొత్త గనులను ప్రారంభిస్తామని చెప్పారు. వాటిలో 3 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు ఉంటాయని తెలిపారు. కానీ ప్రభుత్వం వాటి సంఖ్యను 6 నుంచి 12కు పెంచింది. వాటిలో 6 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. వాటిలో ఒక దానిని డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రారంభింపజేసేందుకు సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. 

కొత్తగా ప్రారంభించబోయే భూగర్భ గనుల వివరాలు: మందమర్రిలో కల్యాణి ఖని-6, కాసీపేట్-2, భూపాలపల్లిలో కాకతీయ ఖని-3 మరియు 5 (లాంగ్ వాల్), మణుగూరు కొండాపురం ఖని, కొత్తగూడెంలో రామాపురంలో షాఫ్ట్ బ్లాక్ గనులు. 

ఓపెన్ కాస్ట్ మైనింగ్ గనుల వివరాలు: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కిష్టాపురం, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో ఇందారం, శ్రావణ్‌పల్లి, భూపాలపల్లిలో కాకతీయ ఖని ఓసీ–3, కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కోయగూడెం-3, పెద్దపల్లిలో గోదావరి ఖని-10 ఓపెన్‌ కాస్ట్‌ గనులు. 

ఈ 12 కొత్త గనులతో కలిపి సింగరేణికి మొత్తం 35 భూగర్భ గనులు, 23 ఓపెన్ కాస్ట్ గనులు ఏర్పడుతాయి. ఈ కొత్త గనుల త్రవ్వకాలకు అవసరమైన పర్యావరణ మరియు ఇతర అనుమతులను కేంద్రప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. కొత్తగా ప్రారంభించబోతున్న ఈ గనుల ద్వారా కొన్ని వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా భూగర్భ గనులలో ఎక్కువ ఉద్యోగాలు ఏర్పడుతాయి. భూగర్భ గనులపై సింగరేణి సంస్థ రూ.2,300 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. ఈ 12 గనుల ద్వారా ఏడాదికి 21.07 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని అంచనా.