తెలంగాణాలో ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు రంగం సిద్దం అవుతోంది. రాష్ట్రంలో వామపక్షాలతో సహా 27 చిన్నా పెద్దా పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కూడిన ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కాబోతోంది. సిపిఐ (ఎమ్మెల్యే) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అద్వర్యంలో సంబంధిత పార్టీల, సంఘాల ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యి, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించి సూత్రప్రాయంగా అంగీకరించారు. రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు పోతున్న అధికార తెరాసకు, అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీకి, మతతత్వ పార్టీ అయిన భాజపాకు ప్రత్యామ్నాయంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని నిర్ణయించారు. కనుక సంబంధిత పార్టీల, సంఘాల ప్రతినిధులు మళ్ళీ మరికొన్నిసార్లు వరుసగా సమావేశమయ్యి, ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మార్గదర్శకాలు, కార్యాచరణ ఖరారు చేసుకొందామని నిర్ణయించుకొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, ఉమ్మడి కార్యాచరణ, ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రజలలోకి వెళ్ళాలని నిర్ణయించారు. వచ్చే ఎన్నికలలో మొత్తం 119 నియోజకవర్గాలలో ధర్డ్ ఫ్రంట్ తరపున అభ్యర్ధులను నిలబెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.