తెలంగాణా రాష్ట్రంలో ఫిరాయింపుల కారణంగా తెదేపా, వరుస ఓటముల కారణంగా భాజపా రెండూ బలహీనపడటంతో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా మిగిలింది. కనుక వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్, తెరాసలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అయితే అగ్రవర్ణాల ఆధిపత్యంలో సాగుతున్న ఈ రెండు పార్టీల వలన తెలంగాణా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, రెండూ ఒక తానులో ముక్కలేనని, కనుక వాటికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు రాజ్యాధికారం కల్పించినప్పుడే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
కాంగ్రెస్, తెరాసలకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేసేందుకు రేపు ఆదివారంనాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో వామపక్షాల నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు సమావేశం కాబోతున్నారు. ఆ తరువాత వరుసగా మరికొన్ని సమావేశాలు నిర్వహించుకొని అన్ని విషయాలపై ఒక అవగాహనకు వచ్చిన తరువాత వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి నెలలోగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు.
అవినీతిరహితమైన, ప్రజాస్వామ్యయుతమైన, స్వేచ్చా స్వాతంత్ర్యాలు కలిగిన సామాజిక తెలంగాణా ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా ఈ ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఫ్రంట్ తరపున మొత్తం 119 శాసనసభ స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టాలని భావిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. త్వరలోనే దీనిలో సభ్యులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తారని తెలిపారు.