గిరిజనులకు కెసిఆర్ వరాలు!

తెలంగాణా రాష్ట్రంలో సుమారు 30 లక్షలమంది గిరిజనులున్నారు. వారిలో అత్యధిక శాతం పేదరికంలో మగ్గుతున్నవారే. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టి పెట్టారు. ప్రగతి భవన్ లో శుక్రవారం తెరాసలోని గిరిజన ఎంపి, ఎమ్మెల్యేలు, ఆ శాఖా ఉన్నతాధికారులతో సమావేశమయ్యి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 

నిరుపేద గిరిజనులు ఇళ్ళకు వినియోగించుకొన్న విద్యుత్ కు బిల్లులు చెల్లించలేకపోతున్నారని ప్రజాప్రతినిధులు చెప్పడంతో వారి బకాయిలన్నిటినీ మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ అంగీకరించారు. మళ్ళీ ఈరోజు జరుగబోయే సమావేశానికి వారి బకాయిల లెక్కలు తీసుకురమ్మని ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఆ లెక్కలు చూసిన తరువాత బకాయిల రద్దుకు ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఏజన్సీ ఏరియాలలో పోడు వ్యవసాయం చేసుకొంటున్న గిరిజనులకు వారు సాగుచేసుకొంటున్న భూములపై యాజమాన్యపు హక్కులు కల్పించాలని ఆలోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బ్యాంకులతో ఎటువంటి సంబంధమూ లేకుండా గిరిజనులకు 100 శాతం సబ్సీడీపై రూ.1.5-2.0 లక్షలు విలువైన ఆవులు, మేకలు అందిస్తామని తెలిపారు. ఇంకా గిరిజన ప్రాంతాలకు 3 ఫేజ్ విద్యుత్, రోడ్లు, విద్యా, వైద్య సదుపాయాలు కలుగజేస్తామని చెప్పారు. 

అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, గురుకుల విద్యాలయాలలు, సంక్షేమ హాస్టల్స్ లో గిరిజన విద్యార్ధుల దరఖాస్తులకు తొలి ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి అభ్యంతరాలు లేవనెత్తకుండా వారిని చేర్చుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. గిరిజనుల సంక్షేమం కోసం స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారు.