అమ్మ..అంటే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. ఆమె బ్రతికి ఉన్నంతకాలం ఆమెవైపు..రాష్ట్రంవైపు ఎవరూ కన్నెత్తి చూడలేకపోయేవారు. కానీ ఇప్పుడు ఆమె నివాసం పోయెస్ గార్డెన్ లోనే శుక్రవారం రాత్రి ఆదాయపన్ను అధికారులు శోదాలు నిర్వహించారు. మొత్తం 10 మంది అధికారులు, దాదాపు 1,000 మంది పోలీసు బందోబస్తుతో నిన్న రాత్రి సుమారు 10 గంటల సమయంలో పోయెస్ గార్డెన్ చేరుకొని జయలలిత సహాయకుడు పూంగుండ్రం మొదటి అంతస్తులో వినియోగించిన గదిలో తణికీలు చేశారు. అందుకు హైకోర్టు అనుమతించడంతో పళనిస్వామి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది.
ఇటీవల జయ టీవి కార్యాలయంలో, శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ వారి బంధుమిత్రుల ఇళ్ళలో సోదాలు నిర్వహించిన ఐటి అధికారులకు అనేక కేజీల బరువున్న వెండిబంగారు ఆభరణాలు, కోట్లాది రూపాయల విలువైన స్థిరాస్తుల పత్రాలు లభించాయి. బహుశః అక్కడ లభించిన ఆధారాలతో వారు పోయెస్ గార్డెన్ లో కూడా తణికీలు నిర్వహించి ఉండవచ్చు.
ఈ విషయం తెలుసుకొన్న అన్నాడిఎంకె కార్యకర్తలు, దినకరన్ అనుచరులు అక్కడికి చేరుకొని తమకు ఆరాధ్య దైవమైన అమ్మ ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించడాన్ని నిరసనలు తెలుపుతూ కాసేపు రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. శశికళ తరపున ఆమె న్యాయవాది సెందూర్ పాండియన్ కూడా అక్కడకు చేరుకొని తన సమక్షంలోనే తణికీలు నిర్వహించాలని పోలీసులతో వాగ్వాదాలు చేయడం విశేషం. పోలీసులు ఆయనను లోపలకు అనుమతించలేదు కానీ జయ టీవి ఛానల్ సీఈఓ వివేక్ ను ఫోన్ చేసి లోపలకు పిలిపించుకోవడంతో బయట ఆందోళన చేస్తున్న వారందరూ ఆశ్చర్యపోయారు.
శశికళ, దినకరన్ వర్గీయులు ఈ ఐటి దాడులను రాజకీయ కక్ష సాధింపు చర్యలని వాదిస్తున్నప్పటికీ, సోదాలలో బారీగా పట్టుబడుతున్న వెండిబంగారు ఆభరణాలు, వందల కోట్ల విలువచేసే స్థిరాస్తి పత్రాల కారణంగా తమ వాదనను గట్టిగా సమర్ధించుకోలేని నిసహాయ పరిస్థితులో ఉన్నారు. ఈ ఐటి దాడులతో పళని, పన్నీరు వర్గాలు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.