ఆ రోజు నుంచే మెట్రో సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ ప్రజలు ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్న మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభోత్సవానికి తెలంగాణా ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. నవంబర్ 28వ తేదీన మధ్యాహ్నం 2-3 గంటల మద్య ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద మెట్రో రైల్ సర్వీసులకు జెండా ఊపి ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం అదే రైలులో అయన, ముఖ్యమంత్రి కెసిఆర్, కొందరు మంత్రులు, ఉన్నతాధికారులు కలిసి అమీర్ పేట వరకు ప్రయాణం చేస్తారు. ప్రధాని నరేంద్ర మోడీకి అమీర్ పేట్ ఇంటర్ చేంజ్ మెట్రో స్టేషన్ చూపించిన తరువాత మళ్ళీ అందరూ కలిసి అదే మెట్రో రైల్లో మియాపూర్ తిరిగి వెళతారు. అనంతరం మియాపూర్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు. తరువాత హెచ్.ఐ.సి.సి.లో జరిగే సదస్సుకు వెళతారు. మియాపూర్ వద్ద బహిరంగ సభ ముగిసి మోడీ సదస్సుకు వెళ్ళిపోయిన వెంటనే మెట్రో సర్వీసులు ప్రారంభం అవుతాయి. అప్పటి నుంచి ప్రజలు వాటిని ఉపయోగించుకోవచ్చు. 

హైదరాబాద్ నగరంలో నానాటికీ ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్నందున రోజూ ఈ మార్గంలో వెళుతున్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా మియాపూర్ నుంచి అమీర్ పేటకు రోడ్డు మార్గంలో చేరుకోవాలంటే ట్రాఫిక్ కారణంగా కనీసం గంట సమయం పడుతుంది. అదే బారీ వర్షాలు పడితే రెండు మూడు గంటలు పడుతుంటుంది. కానీ ఎటువంటి వాతావరణంలోనైనా మియాపూర్ నుంచి అమీర్ పేటకు మెట్రోలో కేవలం 10-15 నిమిషాలలో చేరుకోవచ్చు. కనుక ఈ మెట్రో రైల్ సర్వీసులు ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారబోతున్నాయి. ఈ మెట్రో రైల్ మియాపూర్ నుంచి  జె.ఎన్.టి.యు-కె.పి.హెచ్.బి- కూకట్ పల్లి-బాలానగర్-మూసాపేట్-భరత్ నగర్-ఎర్రగడ్డ-ఈ.ఎస్.ఐ-ఎస్.ఆర్.నగర్ మీదుగా అమీర్ పేట చేరుకొంటుంది. ఈ దిగువన ఇచ్చిన హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్ రూట్ మ్యాప్ పరిశీలించినట్లయితే, అది హైదరాబాద్లో అన్ని ప్రధాన ప్రాంతాల గుండా సాగుతోందని అర్ధం అవుతుంది.