50 రోజులన్నారు..16 రోజులకే ముగించేశారు!

ఈసారి శాసనసభ, మండలి సమావేశాలు 50 రోజులు నిర్వహిస్తామని అవసరమైతే బడ్జెట్ సమావేశాల వరకు పొడిగిస్తామని గొప్పగా చెప్పుకొన్న తెరాస సర్కార్, 16 రోజులకే ఉభయసభల సమావేశాలను ముగించేసింది. ఈరోజు బిఏసి సమావేశం నిర్వహించి తదుపరి రోజుల షెడ్యూల్ మరియు అజెండాను ఖరారు చేద్దామని గత బిఏసి సమావేశంలో అనుకొన్నారు. కానీ బిఏసి సమావేశం నిర్వహించలేదు శుక్రవారంతో సమావేశాలను ముగించేసి ఉభయసభలను నిరవదికంగా వాయిదా వేశారు.

అయితే ఈసారి శాసనసభ జరిగినన్ని రోజులు అర్ధవంతమైన చర్చలు జరిగాయి. ప్రతిపక్ష సభ్యులు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం కూడా గట్టిగా సమర్ధించుకొంది. మొత్తం 69 గంటల 25 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు జరుగగా వాటిలో రైతు రుణమాఫీ, విద్యార్ధులకు స్కాలర్ షిప్స్, ఫీజ్-రీఇంబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ, మైనార్టీ సంక్షేమం, భూసర్వే, విద్యావ్యవస్థ మొదలైన అంశాలపై లోతుగా చర్చలు జరిగాయి.

పీడీయాక్ట్ సవరణ బిల్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వ్యాట్ సవరణలు-2, గేమింగ్, ఎక్సైజ్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్, రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, లోకాయుక్త, ధార్మిక, అధికార భాషా బిల్లులు కలిపి మొత్తం 11 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.

ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర విద్యుత్ సరఫరా, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, సింగరేణిలో 6 కొత్తగనుల ప్రారంభిస్తున్నట్లు శాసనసభలో తెలియజేశారు.