భార్యకు 4 ఏళ్ళు...భర్తకు 2 ఏళ్ళు!

భార్యకు 4 ఏళ్ళు...భర్తకు 2 ఏళ్ళు అనగానే ఇదేదో బాల్యవివాహానికి సంబంధించిన వార్త అనేసుకోవద్దు. ఇది జయలలిత మృతి తరువాత తమిళనాడులో చక్రం తిప్పాలని ప్రయత్నించి భంగపడిన శశికళ, ఆమె భర్త నటరాజన్ అవినీతి భాగోతాలకు సంబందించిన వార్త. ఆమె అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహర జైలులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తుంటే, ఆమె భర్త నటరాజన్ కూడా ఈరోజు మద్రాస్ హైకోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విదించింది.

అతను విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ‘లెక్సేస్’ మోడల్ విలాసవంతమైన కారుకు పన్నులు చెల్లించనందుకు  అతనిపై మద్రాస్ హైకోర్టులో ఒక కేసు నమోదు అయ్యింది. దానిపై సుదీర్ఘ విచారణ అనంతరం  2010 లో అతనిని దోషిగా ప్రకటించింది. అయితే అతను మళ్ళీ అప్పీలు చేసుకొంటూ మరో పిటిషన్ వేశారు. దానిపై ఏడేళ్ళపాటు విచారణ జరిపిన తరువాత ఆ కేసులో అతనితో సహా మరో ముగ్గురు దోషులేనని నిర్ధారించి, ఒక్కొక్కరికీ రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. దీనిపై నటరాజన్ సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకోవడం తధ్యమే కనుక అతను ఇప్పట్లో జైలుకు వెళ్ళకపోవచ్చు. కానీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, దానిపై అది విచారణ చేపట్టి మద్రాస్ కోర్టు తీర్పుపై స్టే మంజూరు చేసేవరకు చెన్నై జైలులో చిప్పకూడు తినకతప్పదు.