ఆమె అందుకే పెరోల్ తీసుకొందా?

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరపన్న అగ్రహార జైలులో నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకె మాజీ నేత శశికళ, కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చావుబ్రతుకులమద్య ఉన్న తన భర్త నటరాజన్ ను చూసేందుకు ఐదు రోజులు పెరోల్ పై బయటకు వచ్చారు. భర్తకు సేవలు చేయడం తప్ప మరే ఇతరత్రమైన పనులు చేయకూడదనే షరతుపై కోర్టు ఆమెకు పెరోల్ మంజూరు చేసింది. కానీ చెన్నై ఆసుపత్రిలో ఉన్న ఆ ఐదు రోజులలో ఆమె తనకు సంబంధించిన 622 ఆస్తులను ఇతరుల పేర్లకు మార్చినట్లు ఐటి అధికారులు గుర్తించారు. కనుక ఐటి అధికారులు ఆమెను దీనిపై విచారించేందుకు అనుమతి కోరుతూ పరప్పణ అగ్రహారం జైలు సూపరింటెండెంట్ కు లేఖ వ్రాశారు.

ఒకవేళ ఐటి అధికారులు ఆమెపై చేస్తున్న ఈ ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు సేకరించగలిగితే, జైలులో ఉన్న శశికళ, పెరోల్ షరతులు ఉల్లఘించి కోర్టు ధిక్కారనేరానికి పాల్పడినందుకు మళ్ళీ శిక్ష, ఆస్తుల బదిలీ వ్యవహారంలో ఆదాయపన్ను శాఖ నుంచి చర్యలను ఎదుర్కోకతప్పదు.

ఆమె 622 ఆస్తులను ఇతరుల పేర్లకు బదిలీ చేయించడం నిజమైతే, ఆమె ఏ స్థాయిలో అక్రమాస్తులు కూడా బెట్టిందో అర్ధం చేసుకోవడానికి అదే గొప్ప నిదర్శనమవుతుంది. కనుక ఆమె తన భర్తకు సేవలు చేయడానికి కాక, ఈ ఆస్తుల బదలాయింపు కోసమే పెరోల్ తీసుకొని వచ్చినట్లు అనుమానించక తప్పదు.