తెలంగాణా శాసనసభ సమావేశాలలో చర్చించవలసిన అంశాల అజెండాను ఖరారు చేయడానికి, ముందే నిర్ణయించుకొన్నట్లుగా ఇవ్వాళ్ళ బిఏసి సమావేశం జరుగబోతోంది. ఇంతకు ముందు సమావేశంలో వ్యవసాయ రుణాలమాఫీ, ఉద్యోగాల భర్తీ, విద్యార్ధుల ఫీజ్-రీఇంబర్స్ మెంట్ మొదలైన అంశాలను అజెండాలో చేర్చి వాటిపై లోతుగా చర్చించారు. అయితే ప్రతిపక్షాలు వాటిలో లోపాలను ఎత్తిచూపి సరిచేయమని కోరినప్పటికీ తెరాస సర్కార్ వారి ఆరోపణలను తేలికగా కొట్టిపడేసింది. రైతు రుణమాఫీ పూర్తిగా జరుగకపోవడం వలన అనేకమంది రైతులకు బ్యాంకులు కొత్తరుణాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఉదాహరణతో సహా వివరించినప్పటికీ, తాము హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ కార్యక్రమం పూర్తి చేశామని, కనుక ఇక ఆ విషయంలో తామేమీ చేయలేమని మంత్రి పోచారం స్పష్టం చేశారు.
తాము లేవనెత్తుతున్న సమస్యలను పట్టించుకోకుండా శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు గంటగంటలు ప్రసంగాలు చేస్తూ తమ గొప్పలు చెప్పుకోవడానికే పరిమితం అవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుక ఈరోజు బిఏసి సమావేశంలో అజెండా ఏమి నిర్ణయిస్తారో, దానిపై శాసనసభలో ఎటువంటి చర్చలు జరుగుతాయో చూడాల్సిందే.